Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుక్కున్న, అమ్ముడుపోయిన వారికి గుణపాఠం
- ప్రజా ప్రతినిధుల కొనుగోలు ఆత్మగౌరవం దెబ్బతీసినట్లేగా?
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం పదవికి రాజీనామా చేశానని, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ద్వంద స్వభావాన్ని అవలంభిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తు కులమత చిచ్చులు పెడుతున్న బీజేపీని తన్ని తరిమేందుకు గ్రామాలలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గ్రామాలలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసుకున్నంత మాత్రాన కార్యకర్తలు పార్టీలు మారరన్నారు. రాజగోపాల్ రెడ్డి కేవలం డబ్బు అహంకారంతో ప్రజల్ని కొనుగోలు చేసి గెలవచ్చని బ్రమ పడుతున్నాడని, గ్రామాలలో ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికలలో నమ్మిన ప్రజలను మోసం చేసి బిజెపికి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి, ఇతర పార్టీలో గెలుపొంది బీజేపీలోకి పోతున్న ప్రజాప్రతినిధులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తలేవులతో పాటు ఇతర వస్తువుల పైన వివిధ రకమైన పన్నులను విధించి సామాన్యులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పెద్ద కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆదాని అంబానీ ఆస్తులు పెంచేందుకు మోడీ ప్రభుత్వ రంగస్థలంలో ఉన్న సంస్థలను ప్రయివేట్ రంగం చేసి వేలాదిమంది ఉద్యోగుల పొట్ట కొట్టడంతో పాటు నిరుద్యోగ సమస్యను పెంచాడని విమర్శించారు. అన్ని రంగాలను అణచివేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు యువత మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాల భరత్, గ్రామ కార్యదర్శి నారబోయిన నరసింహ, అయితగోని నరసింహ, పగిళ్ల పరమేష్, పగిళ్ల మధు, కట్ట ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.