Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సద్దుల బతుకమ్మ
నవతెలంగాణ - భువనగిరి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. ''బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో'' పాటల వెనుక ఉండే అర్థం ఇదే. బొడ్డెమ్మ ఎంగిలిపూలతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగ సద్దుల (పెద్ద) బతుకమ్మ నిమజ్జనం తో ముగుస్తుంది. పట్టు చీరలు,పట్టు పరికిణిలతో ముస్తాబు అవుతారు. సద్దలు(సజ్జలు)చేెసిన రొట్టెను బెల్లం లేదా చెక్కరతో కలిపి ముద్దగా చేస్తారు. వీటిని మలిద ముద్దలు అంటారు. ముద్దలను ప్రసాదం గా పంచుకుంటారు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నిండిఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. జొన్న, సజ్జ పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. నేడు బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
తగ్గిన తంగేడు, గునుగు, ముచ్చాల పువ్వులు
గతంలో ఎన్నాడు లేని విధంగా ఈ సారీ తంగేడు, గునుగు, ముచ్చాల పువ్వులు అమ్మకాలు తగ్గాయి. ధరలు మండిపోతున్నాయి. బంతి, చేమంతి, పట్టుకుచ్చు పువ్వులు వాడుతున్నారు.