Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-కేతేపల్లి
అమరుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డిి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో కామ్రేడ్ అలుగు బెల్లి లింగారెడ్డి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుకుట్ల శోభన్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. లింగారెడ్డి బతికినంత కాలం పట్టినటువంటి ఎర్రజెండా వీడకుండా సీపీఐ(ఎం) నాయకుడిగా ఉండి చివరి వరకు ప్రజా పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని గుర్తుంచుకొని భవిష్యత్ తరాలకి వారి పోరాటా స్ఫూర్తిని అందించటానికి గుర్తుగా గ్రామంలో స్థూపాన్ని నిర్మించిన స్థానిక కామ్రేడ్స్‌ని అభినందించారు. ప్రజల్లో ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేసేటటువంటి వారు ఒక కమ్యూనిస్టులు మాత్రమే, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన చోట ప్రజలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక సరైన విద్య, వైద్యం లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ దుర్భరమైనటువంటి జీవనం గడుపుతున్నారని చెప్పారు. జీఎస్టీ పన్నుల భారంతో దేశంలో లక్షలాది కంపెనీలు మూతపడ్డాయని, కోట్లాదిమంది నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం అన్న నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలయ్యాయన్నారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఆదానీ అంబానీ లాంటి వాళ్లకు అమ్మేస్తున్నాడని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కూడా పెట్టుబడుదారులకు అమ్మటం కోసం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారని, రైతులు, ప్రజలు తిరుగుబాటుతో వెనక్కి తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ దొడ్డి దారిన వాటిని అమలు చేయడం కోసం రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీని తొలగించి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి ఉపాధి కూలీలకు పని దొరక్కుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవడం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా పోరాటాల్లో పాల్గొనేందుకు ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, సీనియర్ నాయకులు బోళ్ళ నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, కేతపల్లి మండల కార్యదర్శి చింతపల్లి .లూరుద్, నాయకులు లక్కపాక రాజు, స్థానిక సర్పంచ్ రాచకొండ సరిత సైదులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య, లింగంపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.