Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వర్గాల మధ్య ఘర్షణ
- భయాందోళనకు గురిచేసిన దసరా వేడుకలు
నవతెలంగాణ- నాగారం
మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో బుధవారం ఎస్సీ వర్గానికి, యాదవ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగంగా మారింది. వివరాల్లోకి వెళితే... గ్రామ పంచాయతీ ఆవరణలో జమ్మి చెట్టు దగ్గర పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఇరువర్గాలు ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని రాళ్లు ,కర్రలతో దాడి చేసుకున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ-1 యాదవ వర్గానికి చెందినవారు కావడంతో ఆ వర్గానికి చెందిన వ్యక్తులు కొంతమంది జమ్మి చెట్టుకు పూజలు చేయకుండా తమపై దాడులు చేశారని నాగారం పోలీస్స్టేషన్లో ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీటీసీ-2 పర్శరాములు , ఉప సర్పంచ్ ఈదుల కిరణ్ బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు .ఫిర్యాదు చేసి కారులో వారు ఇంటికి వెళ్తుండగా పాటిమీద యాదవ వర్గానికి చెందిన వ్యక్తులు కారును అడ్డగించి కర్రలతో రాళ్లతో ధ్వంసం చేశారు. కారును ఆపకుండా వెళ్లడంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని ఎంపీటీసీ పర్శరాములు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న నాగారం ఎస్ఐ ముత్తయ్య గ్రామానికి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టి వారిని శాంతింపజేశారు నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ వర్ధమానుకోటలో శాంతి భద్రతలను కాపాడడానికి సర్కిల్ పరిధిలో ఉన్న అర్వపల్లి, తిరుమలగిరి ఎస్ఐలను అలర్ట్ చేసి పోలీసు సిబ్బందితో వర్ధమానుకోట పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా బయటకు వెళ్లి గొడవలు సృష్టిస్తే అలాంటి వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు.