Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి బీజేపీ కోవర్టు...
- తమ్ముడు రాజగోపాల్ కోసం పనిచేస్తుండు..
- పార్టీ నుంచి సస్పెండ్ చేయాలే..
- లేకపోతే మూకుమ్మడి రాజీనామా...
- పార్టీ నేతలకు మునుగోడు నేతల ఆల్టిమేటం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నిక ఇపుడు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య. అయినా ఆ పార్టీ నిత్యం మూడు కోట్లాటలు, ఆరు పంచాయితీలు అన్న చందంగా ఉంది. పార్టీలో అంత ప్రశాంతంగానే ఉన్నట్లుగానే కనిపిస్తుంది.అంతలోనే ఉప్పెనలా విమర్శల హోరుగా మారిపోతుంది. ఇపుడు అదే పరిస్థితి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఉంది. పార్టీని మోసం చేసిన తమ్ముడి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ పనిచేస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలనే డిమాండ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు.
పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిర పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. తనను విమర్శించారనే కారణంతో అలకబూనారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌లు వారు చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ క్షమాపణ చెపుతున్నట్లుగా బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత డిల్లీ స్థాయిలో పార్టీ పెద్దలతోపాటుగా , ప్రియాంక గాందీ కూడ వెంకటరెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత శాంతించినట్లే ప్రకటన చేశారు. ప్రచారానికి వస్తానని కూడ చెప్పారు. మునుగోడు అభ్యర్థి ఎంపిక సమయంలో కూడ ఆయన చెప్పినట్లుగా టికెట్ కేటాయించడంలో ప్రాదాన్యత ఇచ్చి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించారు. స్రవంతి పేరును ప్రకటించిన తర్వాత స్వయంగా ఆమె నేరుగా ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి ప్రచారానికి రావాలని అభ్యర్థించారు. అపుడు కూడ తప్పకుండా వస్తానని ఆమెకు హామీ ఇచ్చారు.
ఇలాంటి పరిస్థితులలో ఎంపీ కోమటిరెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడం పట్ల మునుగోడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తన సోదరుడు బిజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి కోవర్టుగా మారిపోయారని, గత రెండు నెలలుగా అనేక మంది పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ తన సోదరుడి గెలుపు కోసం పనిచేయాలని అందరిపై ఒత్తిడి తీసుకువస్తారని పార్టీ నేతలు గతంలో మీడియా ముందు చెప్పారు. అవకాశం దొరికితే పార్టీతో పాటుగా తెలంగాణను కూడ అమ్మేస్తారని, తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ కేటాయించిన తర్వాత ఎందుకు ప్రచారం చేయడంలేదని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెపాల్సిన అవసరం ఉందని, 24గంటలలో కోమటిరెడ్డి పార్టీ నుంచి బహిష్కరించకపోతే తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తాని నియోజకవర్గ నేతలు పార్టీ నేతలకు ఆల్టిమేటం ఇచ్చారు. గత మూడేండ్ల నుంచి బిజేపీకి టచ్‌లో ఉన్నామని, తన సోదరుడు కూడ తనతోనే ఉంటారని రాజగోపాల్‌రెడ్డి చెపుతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని నాయకులు పోలగోని సైదులు గౌడ్, బోయపల్లి రాజు, జాల లింగయ్య, గందం లింగస్వామి, బోయపల్లి శ్రీను, సోమగాని మహేష్ తదితర నేతలంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టీమేటం జారీచేశారు. నేతల ఒత్తిడికి పార్టీ ఆదిష్టానం దిగివస్తుందా... ఎంపీ కోమటిరెడ్డిని సస్పెండ్ చేయగలరా... లేకపోతే పార్టీ కోసం ఎంపీ ప్రచారానికి వస్తరా... తన సోదరుడి కోసం ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటూ కాలం వెళ్లదీస్తారా .. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.