Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
- టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి ఉభయ కమ్యూనిస్టులు సత్తా చాటాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పద్మశ్రీ ఫంక్షన్హాల్లో ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. టీఆర్ఎస్ను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. మునుగోడులో ఎవరైనా వామపక్షాలు లేకుండా గెలవబోమని అనుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎర్ర జెండాలు రెపరెపలాడే విధంగా ఏర్పాటుచేయాలన్నారు. దేశంలో మోడి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. మునుగోడు ప్రజలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పటిష్టతను చాటి చెప్పాలన్నారు. టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి బీజేపీని ఓడించాలన్నారు.
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడి ప్రభుత్వం
మోడి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
దేశంలోని మోడి ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం చౌటుప్పల్ మండలకేంద్రంలోని పద్మశ్రీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రంగారెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కోసమని రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారినట్టు చెప్పుకోవడంలో వాస్తవం లేదన్నారు. తన అభివృద్ధి కోసమే పార్టీ మారాడని, ఇందులో బీజేపీ రాజకీయ ప్రయోజనం ఉందన్నారు. దక్షిణ తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించారు. మోడి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తుందని విమర్శించారు. దేశ సంపదను పది మంది బడా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టిందని విమర్శించారు. దేశ సంపదను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. బీజేపీని బలహీనపర్చడమే కమ్యూనిస్టుల లక్ష్యమన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్కు మద్ధతు ఇస్తున్నామని తెలిపారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకుల్లో ఐక్యత లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలు, వైఫల్యాల వల్లే బీజేపీ బలపడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని దేశం నుండి తరిమికొట్టాలన్నారు. మునుగోడులో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, నారి అయిలయ్య, బట్టుపల్లి అనురాధ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, మేక అశోక్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, మున్సిపాలిటీ, మండలాల కార్యదర్శులు బండారు నర్సింహా, గంగదేవి సైదులు, దోడ యాదిరెడ్డి, నాంపల్లి చంద్రమౌళి, మిర్యాల భరత్, బొట్టు శివ, ఏర్పుల యాదయ్య, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.