Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలి
- చెరుపల్లి సీతారాములు ,మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యజమాన్యం కార్మికులతో నూతన ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు కోరారు. ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి 17 రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు సీతారాములు మద్దతు ప్రకటించి మాట్లాడారు. 11 నెలలుగా కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోకుండా పనిచేయించుకోవడం కార్మికుల హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. కనీసం కార్మిక చట్టాలను అమలు చేయలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం హాస్యాస్పదమన్నారు. సమ్మె కాలంలో 68 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని లే అఫ్ ప్రకటించిన యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం 60 లక్షలు భరించలేదా అని ప్రశ్నించారు. వేతనాలు పెంచడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఏడాదికి రెండు వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్తున్న యజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. లే ఆఫ్ ప్రకటించిన యాజమాన్యం తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే యాజమాన్యం కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం, ప్రతిష్ట యూనియన్ అధ్యక్షులు ఎండి పాషా, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు బిక్షపతి, భూషయ, నరసింహ, సతీష్, లింగస్వామి, కంచర్ల వెంకటేశం ,తదితరులు పాల్గొన్నారు.