Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-చండూర్
మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో, ఎవరికోసం వచ్చిందో ప్రజలు గమనించాలని, ఈ ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కే. తారకరామారావు (కేటీఆర్) అన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంచేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చిన్న కంపెనీకి ఇన్నీ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. 22 వేల కోట్లకు అమ్ముడు పోయి అహంకారంతో ఈ ఎన్నిక తెచ్చారన్నారు. దేశంలో బీజేపీ నాయకుల కోట్లల్లో మాటలు చెప్పి పకోడీ మాదిరిగా పనులు చేస్తారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తుదన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించి, పవర్ లూం, బఫర్ బీమా తీసివేసి, చేనేతకు మరణశాసనం రాసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నల్లధనం 2 కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాలో జమ చేస్తామన్న 15 లక్షలు ఏమైనాయని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం నుండి ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టాలని శివన్న గూడెం, కిష్టరాంపల్లి, రిజర్వాయర్లను పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి త్వరలో సాగు నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో 5,700 మందికి గొర్రెల యూనిట్ల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. 3,146 తండాలు, చిన్న గ్రామాలను పంచాయితీలుగా మార్చమన్నారు. దండుమల్కాపురం ఇండిస్టియల్ పార్క్‌లో భూములు కోల్పోయిన వారికి త్వరలో ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించి అభివృద్ధి చేస్తామన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, మతతత్వ బీజేపీ కి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బంగారిగడ్డ గ్రామం నుండి చండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, పల్లా వెంకట్ రెడ్డి, చేరుపల్లి సీతారాములు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం...
మునుగోడు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున, ఆటపాటలతో నృత్యాలతో పాల్గొని ర్యాలీతో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. మండలం నాలుగు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని కలిసిన కేటీఆర్
మర్రిగూడ:మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని గురువారం రాష్ట్ర టీిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రచారంలో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా అంశాల స్వామి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఆదేశాల మేరకు పూర్తయిన అంశాల స్వామి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో స్వామితో పాటు కలిసి భోజనం చేశారు. స్వామి నడిపిస్తున్న హెయిర్ సెలూన్ గురించి తెలుసుకున్నారు. దేశంలో గత ప్రభుత్వాలు పాలనలో మునుగోడులో ఫ్లోరోసిస్ నుండి విముక్తి జరగలేదని, అంశాల స్వామిని చూసి చెలించి పోయిన కేసిఆర్ యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ, ఇంటింటికి కృష్ణా జలాలతో త్రాగునీరు వంటి భారీ ప్రాజెక్టుకు తెరలేపారని గుర్తు చేశారు. గత మూడు సంవత్సరాల నుండి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కావట్లేదని ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వ సాధించిన ఘనవిజయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం
చౌటుప్పల్:మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చండూరులో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హైద్రాబాద్ నుండి చండూరుకు వెళ్తున్న సందర్భంగా చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్‌కు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎల్బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిరికటి నిరంజన్‌గౌడ్, నాయకులు తొర్పునూరి నర్సింహాగౌడ్, దైద జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.