Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది రెండు గుంపులుగా షాపుల్లో డబ్బుల వసూలు
- రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు డిమాండ్
- అడిగినంత డబ్బు ఇవ్వకుంటే అసభ్య ప్రవర్తన, తిట్లు, శాపనార్ధాలు
- భయంతో షాపులు మూసివేసిన వ్యాపారులు
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం హిజ్రాలు హల్చల్ చేశారు.వారంలో ఏదో ఒక రోజు ఒకరో ఇద్దరో వచ్చి అడుక్కొని వెళ్లే హిజ్రాలు శుక్రవారం 30 మంది గుంపుగా షాపుల్లో డబ్బులు అడుక్కుంటూ నానా హంగామా సృష్టించారు.దుకాణాల యజమానులు రూ.వంద నుంచి 200 వరకు డబ్బులు ఇస్తే తీసుకోకుండా రూ.1000 నుంచి రూ.3 వేల వరకు డిమాండ్ చేయడంతో దుకాణాదారులు బెంబేలెత్తిపోయారు.తాము అడిగినంత డబ్బు ఇవ్వని దుకాణాల వద్ద బట్టలు లేపుతూ అసభ్య ప్రవర్తనతో చప్పట్లు కొడుతూ తిట్లు, శాపనార్ధాలు పెట్టారు.మూడు ఆటోల్లో వచ్చిన వారు రెండు గ్రూపులుగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులుగా ప్రతి షాపులోకి వెళ్లి డబ్బులు వసూలు చేశారు.రూ.3 వేల వరకు డిమాండ్ చేస్తుండటంతో ఇవ్వమని నిరాకరించిన వారి షాపుల్లోకి దూరి వస్తువులు, బట్టలు చిందరవందర చేసి షాపుల యజమానులతో గొడవపడ్డారు. హిజ్రాలు బట్టలు లేపుకొని చేస్తున్న అసభ్య ప్రవర్తనతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండటంతో కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వ్యాపారులంతా తమ షాపులను మూసివేశారు.దీంతో పట్టణమంతా బంద్‌ను తలపించింది.షాపులన్ని మూసి ఉండడం, కొందరు తిరగబడే ప్రయత్నం చేయడంతో హిజ్రాలు ఆటోల్లో వెళ్లిపోయారు.ఇటీవల హిజ్రాల ఆగడాలు ఎక్కువై తాము వ్యాపారం చేసుకోలేకపోతున్నామని, వారానికో రోజు ఇలానే చేస్తున్నారని పలువురు వ్యాపారులు వాపోయారు. శృతిమించుతున్న హిజ్రాల ఆగడాలను పోలీసులు అరికట్టాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.