Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుజిలాపురం వాసి చంద్రమౌళి మృతిపై ఉద్రిక్తత
- మృతదేహంతో గ్రామస్థులు, బంధువుల ఆందోళన
- మెత్కూరు, ధర్మాపురంలో రోడ్లపై బైటాయించిన గ్రామస్థులు, బంధువులు
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం వాసి పంగ చంద్రమౌళి అనుమానాస్పద మృతిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, బంధువులు సుమారు 300 మంది సోమవారం రాత్రి రెండు చోట్ల ధర్మాపురంలో మోత్కూరు-నార్కట్ పల్లి రహదారిపై, మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తాలో భువనగిరి రోడ్డుపై బైటాయించారు. బుజిలాపురం గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి (56) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎల్లాంల రాములమ్మ ఫోన్ చేయడంతోనే తన భర్త వెళ్లాడని, తన భర్త మృతిపై అనుమానం ఉందని మృతుని భార్య సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవాన్ని పోస్టుమార్టం కోసం ఆదివారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు సోమవారం రాత్రి బుజిలాపురం గ్రామానికి తరలిస్తుండగా గ్రామస్థులు, బంధువులు ధర్మాపురంలో అడ్డుకుని మృతదేహాన్ని ఎల్లాంల రాములమ్మ ఇంటి వద్ద వేసి ఆందోళనకు దిగారు. చంద్రమౌళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మాపురంలో, మోత్కూరులో రెండు చోట్ల రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకోలతో మోత్కూరు-నార్కట్ పల్లి, మోత్కూరు-భువనగిరి రూట్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ నినాదాలు చేస్తూ భీష్మించి కూర్చున్నారు. గ్రామస్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సమస్య పరిష్కారం కోసం ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో మృతదేహంతో రాములమ్మ ఇంటి వద్ద ఆందోళన కొనసాగించారు. మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల ఎస్ఐలు వి.జానకిరాంరెడ్డి, జి.ఉదరు కిరణ్, మధు సిబ్బందితో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.