Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతుచిక్కని ఓటరు నాడి
- పార్టీల సభలు,సమావేశాలకు వెల్లువలా ప్రజలు
- ఎవరొచ్చి అడిగినా మా ఓటు మీకే అంటున్న ఓటర్లు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ ఏ పార్టీ వారు సభలో,సమావేశాలు,ప్రచారాలు నిర్వహించినా ప్రజలు వెల్లువల్లా తరలి వెళ్తున్నారు.ఖర్చుల మటుకు డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు. అంటే ఆర్థికంగా ఈ ప్రాంత ప్రజలు ఎంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవాలి .కూలీ పడితే చాలనుకుంటున్నారు. ఆ రోజు మటుకు వచ్చిన వారికి రూ.300 నుంచి 500 వరకు చెల్లిస్తున్నారు. ఇందులో పేర్లు రాసుకునే వారు అత్యధిక మంది పేర్లు రాసి అభ్యర్థుల వద్ద అధిక మొత్తంలో నొక్కేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.గ్రామాల వారీగా వివిధ పార్టీలో రోజు ఇంటింటి ప్రచారాల పేరుతో తిరుగుతున్న పార్టీ కార్యకర్తలకు ఉదయం టిఫిన్ నుండి సాయంత్రం మందు వరకు కొరత లేదు. తాగినోడికి తాగినంత, చిన్నోడికి తిన్నంత దొరుకుతుంది. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. గ్రామంలో కొంచెం పలుకుబడి ఉన్న నాయకుడు అయితే చాలు ఆయా పార్టీలు కన్నేస్తున్నాయి.2014 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండేది కాదు.ఎవరి పార్టీ వారికి ఉండేది. ఇంకో పార్టీ వారు గడప కూడా తొక్కేవారు కాదు.ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంకు ఇంత అని చెప్పుకునే పరిస్థితి ఉండేది.ప్రస్తుతం జరగనున్న ఉపఎన్నికల్లో ఈ పరిస్థితి లేదు. ఒకే రోజు ఒక మండల కేంద్రంలో గాని, గ్రామంలో గాని టిఆర్ఎస్,కాంగ్రెస్,బిజెపి పార్టీల ప్రచార కార్యక్రమాలు ఉంటే అదే జనం కండువాలు మార్చుడం ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది.ఏ పార్టీకి ప్రజలు లేరు అనే పేరు రాకుండా చూసుకుంటున్నారు. అన్ని పార్టీలు తమ వే అన్నట్టుగా నడుచుకుంటారు.అన్ని పార్టీలకు చెందిన సాధారణ ఓటర్లు,మహిళలు ఏ పార్టీ వారు పిలిచినా కాదనకుండా వెళ్తున్నారు.ఏ పార్టీ వారు వచ్చి ఓటు ఎవరికి వేస్తావని అడిగితే మా ఓటు మీకే అంటూ సమాధానం చెప్తున్నారు.దీంతో ఓటరు నాడి దొరకక లీడర్ అయోమయానికి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం అధిక మొత్తంలో ఆయా పార్టీలు ఓటరుకు డబ్బులు ఇస్తాయని జరుగుతున్న ప్రచారమే.ప్రజలు ఊరికే రావడం లేదు.ఎన్నికల ప్రచార కార్యక్రమానికి రూ.300 నుంచి500లు ఇవ్వాల్సిందే. ఇందులో అన్ని పార్టీల మహిళలు, సాధారణ ఓటర్లు ఏ పార్టీని వదలకుండా హాజరు వేసుకుంటున్నారు. ప్రజల ఈ విధంగా మారడానికి కారణం ఇక్కడ ఈ గతంలో గెలుపొందిన నాయకులు అభివృద్ధిని పట్టించుకోకపోవడమేనని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తెల్లారితే ఓట్లు అనంగా ఏ పార్టీ వారు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్లే విజయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.