Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మెంట యాదగిరి కుటుంబానికి దాతలు చేయూతనిస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన యాదగిరి గుండెపోటుతో మృతి చెందడంతో భార్య, ముగ్గురు కూతుళ్ల దీనస్థితిని 'ఈ ఆడబిడ్డలను ఆదుకోరూ' శీర్షికన''నవ తెలంగాణ' సోమవారం వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పలువురు దాతలు ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రెడ్ క్రాస్ యాదాద్రి జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. మున్ముందు ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన మాతృదేవోభవ, పితృదేవోభవ సంస్థ అధ్యక్షుడు కురుమేటి నవీన్ 50 కిలోల బియ్యం అందజేశారు. ఇంటి పెద్ద మృతితో దీనస్థితిలో ఉన్న యాదగిరి కుటుంబాన్ని మనస్సున్న దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె భిక్షం, మెంట యాదగిరి, కూరెళ్ల నర్సింహ, మెంట నర్సింహ, ఎం. భిక్షం, కిషన్, చింటు, పక్షన్, మెంటరాజు తదితరులు పాల్గొన్నారు.