Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్ రెడ్డి డబ్బులు సంచులకు మునుగోడు ప్రజలు లొంగరు..
- తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు
నవతెలంగాణ-మునుగోడు
మోడీ అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.380 ఉంటే ఇప్పుడు రూ.1,150 అయిందని, పెట్రోలు రెండింతలు పెరిగిందని ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పళ్ళ రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోతులారం గ్రామంలో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా నాయకులు దాడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెరుకు కృష్ణయ్య ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పార్టీ వార్డు మెంబర్లు టిఆర్ఎస్లో చేరడంతో వారికి ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఆత్మగౌరవని బీజేపీకి తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల సంచులకు మునుగోడు ప్రజలు లొంగరన్నారు. దేశ రాజకీయాల్లో కేసిఆర్ అడుగుపెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి మయంగా మారుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో దిక్కులేని పార్టీగా మిగిలిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎండ్రికిచ్చలులాగా వ్యవహరిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పేర్కొన్నారు. ఫ్లోరైడ్‌తో అల్లాడిన ప్రజలకు మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించి మునుగోడు నియోజకవర్గం నుండి ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు ఇలా ఎన్నో పథకాలతో ఇంటింటా సంక్షేమం, ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లుతున్నదని తెలిపారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యమైనవారన్నారు. మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోతులారం సర్పంచ్ గజ్జల బాలరాజ్, ఉప సర్పంచ్ బండ భాస్కర్ రెడ్డి, వార్డ్ మెంబర్ నాతి స్వామి, ఆనగంటి కృష్ణ, గోల్కొండ ముత్తయ్య, మార్త నవనీత నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ జక్కల లోకేష్, జాజుల నర్సింహ, కందుల నర్సింహ, గుండు చెన్నకృష్ణయ్య, కందుల లింగస్వామి, నర్సింహ, వెంకటేష్,,తదితరులు పాల్గొన్నారు.