Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుత్సాహంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు
మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకు జీవన్మరణ సమస్య.. అందుకే ఆ పార్టీలు ఎన్నికల ప్రచార రంగంలో యుద్దక్షేత్రాన్ని తలపించేలా పోరాడుతున్నారు. అయినప్పటికీి ఆ జాతీయ పార్టీ మొదట్లో ఉన్న ఊపు ఉత్సహం ఇపుడు కనిపించడంలేదు. కొద్ది మంది నేతలే ప్రచారంలో కనిపిస్తున్నారు. అందులో జిల్లాకు సంబందించిన పెద్దనేతలెవరూ ప్రచారం వైపు చూడడంలేదని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలోని కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు సమాచారం.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు వరకు నేతలంతా ప్రజల్లోనే తిరిగారు. కానీ ఇపుడు కొద్దిమంది మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. వారిలో పీసీసీ రేవంత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, అనిల్‌కుమార్, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ , ఇతర మహిళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు పాల్గొంటున్నారు. కానీ జిల్లాకు సంబందించిన మాజీ మంత్రులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మొదట్లో చాలా ఉత్సహంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఇపుడు ప్రచారంలో పాల్గొనడంలేదని తెలుస్తోంది. అయితే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఉప ఎన్నికల ఇన్చార్జీ కూడా నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఇటువైపు రావడంలేదు. జానారెడ్డి వయసురీత్యా రాలేకపోతున్నానే పరోక్షంగా గతంలో కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు. ఇక బాలునాయక్ ఒకటి, రెండు సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి, ఇటువైపు కూడ కన్నెతి ్త చూడడంలేదు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఉపసంహరణ తర్వాత వస్తానని అందరికి ఆశలుండే కానీ ఆయనే పరోక్షంగా 'ఎస్పీలే ప్రచారానికి వెళతారు.. హోంగార్డులు వెళ్లారు' అనే రీతిలో ప్రచారానికి వెళ్లలేను అని చెప్పక చెప్పేశారు. దాంతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎవరూ కూడ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి రావడంలేదు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం '' గాందీభవన్‌లో మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి 'అన్నా.. మునుగోడు రావాలన్న... నా తరుపున ప్రచారం చేయండన్న అని బతిమిలాడింది' అయితే తలపై చేయి పెట్టి అన్ని మంచిగానే జరుగుతాయి.. ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రమే దీవించారు. కానీ ఇప్పటికే ప్రచారానికి వస్తారో... లేదో చూడాలి మరీ..
క్షేత్రస్థాయిలో నిరుత్సాహంగా కార్యకర్తలు
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అతిముఖ్యమైన ఎన్నిక . అయినా జిల్లాలో ఉన్న రాష్ట్ర నేతలంతా ఇటువైపు రావడంలేదని గ్రామస్థాయిలో ఉన్న కాంగ్రెస్ ఎంతో ఆవేదన చెందుతున్నారు. అధికారంలో ఉండి అన్ని అనుభవించి , భవిష్యత్‌లో అధికారం వస్తే అంతా తామే అనే నేతలంతా ఇపుడెక్కడున్నారో.. కనిపించడంలేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇతర పార్టీల నేతలు కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్నికల ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ తాము పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నప్పటికి, ముందు వరుసలో ఉండే నాయకులు లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయనే ఆవేదనలో కార్యకర్తలున్నారు. ఇప్పటికే చాలా మంది కిందిస్థాయిలను అధికార పార్టీ నేతలు భయపెట్టి, బెదిరించి ప్రలోభాలకు గురిచేసి పార్టీ మారేలా ఒత్తిడి చేస్తున్నారు. అయినప్పటికీ పెద్దనేతలు స్పందించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల రోజు నాటికి కార్యకర్తలు లేకుండా పక్కపార్టీలలోకి జంపుయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కార్యకర్తలైతే అన్ని తామై గ్రామాలలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రతి ఓటరుకూ పాదాభివందనాలు...
మునుగోడు నియోజకవర్గంలో కొంత సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది.గతంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి గడపకు వెళ్లి ఓటర్లందరిని కాళ్లు మొక్కి ఓట్లు అభ్యర్థిస్తామని పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇపుడు ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటుగా గ్రామాలలో ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా పాదాభివందనం కార్యక్రమం పెద్దఎత్తున చేస్తున్నారు. దీనికి ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నాయకులైతే పార్టీకి సంబందించిన టీషర్టులు వేసుకుని ప్రతి గడపకూ వెళ్లి పాలకులు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తున్నారు.