Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుగా బెట్టింగులు
- జోరందుకున్న ఉత్త ప్రచారాలు
- ఆశల పల్లకిలో ప్రజలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివద్ధి పేరుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంట్రాక్టు డబ్బుల కోసం బీజేపీలో చేరారు. మునుగోడులో బీజేపీకి గెలిచే ఓట్లు లేకపోయినా ధన ప్రభావాన్ని చూయించి కాంగ్రెస్ ఓట్లను కొనుగోలు చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు , జెడ్పీటీసీలు, వార్డు సభ్యులు మెంబర్లు వంటి అనేకమంది రాజగోపాల్ రెడ్డి శిబిరంలో చేరారు. అధికార టీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులను తన వైపు మళ్లించుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి సాధించేందుకు ఆయా పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ 100 నుంచి 120 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సైతం ఇటీవల గెలుపొందిన దుబ్బాక, హుజురాబాద్ ఎమ్మెల్యేలతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ సైతం పీసీసీ చీఫ్ తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు మండలాల వారిగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకొని విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారాలు ఈవిధంగా ఉండగా ప్రజలు మాత్రం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని కొందరు, అధికార టీిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడని మరికొందరు, కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి గెలుస్తుందని ఇంకొందరు ఎవరికివారు బెట్టింగులు కడుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని అందుకు 'నా పందెం రూ.5 లక్షలు కాస్కో అని' అంటూ ఇతర జిల్లా నుంచి ఇక్కడికి ప్రచారానికి వచ్చిన ఓ కాంగ్రెస్ కార్యకర్త సొంత గ్రామానికి చెందిన కార్యకర్తలతో ఫోను ద్వారా పందెం కాస్తున్నారు.లేదు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అని అతను సమాధానమివ్వడంతో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే 'నీ వద్ద నేను జీతం ఉంటా ..ఓడిపోతే నువ్వు నా దగ్గర జీతం ఉండు'అని అంటూ పందాలు కాస్తున్నారు. 'రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడని రూ.10 లక్షలు పందెం కాస్త నీకు ధైర్యం ఉందా నీకు' అని అంటూ ఇంకొందరు ఫోన్ల ద్వారా సంభాషించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఓటుకు తులం బంగారం ఇస్తారట
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన టీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఆశల పల్లకిలో ముంచుతున్నాయి. ఓటుకు తులం బంగారం ఇస్తారని ఒకరు లేదు లేదు ఒక ఇంటికి తులం బంగారం ఇస్తారని మరొకరు కాదు కాదు ఓటుకు రూ.30 నుంచి 40 వేలు ఇస్తారని ఇంకొకరు ఇట్లా ఓటర్లు ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరికి వారే ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ఓటర్లు ఆశల పల్లకిలో మునిగి తేలుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా తనకు ఓటు ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక్కడి ఓటర్లకు బంధువులు ఫోన్లు చేసి 'ఇంకేంది ఓట్ల పండగ జోరుగా ఓటుకు తులం బంగారం ఒక్కొక్కరు 40 నుంచి 50 వేలు ఇస్తారటగా నీదే బాగుంది పో అంటూ ఫోన్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దగ్గర బంధువులు అయితే నా ఓటు కూడా మీ అడ్రస్ మీద మార్పించరాదు జర' అని అడుగుతున్న పరిస్థితి నెలకొంది. దీపావలి పండగకు ఇంటికో ఫుల్ బాటిల్ అంట కిలో మటన్ అంట కదా అని ఫోన్ సంభాషణలు ఇక్కడి ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. బయట జరుగుతున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఓటరుకు ఇప్పటికీ ఏ పార్టీ సైతం ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ప్రచారం మాత్రం ఓటర్లను అయోమయానికి గురిచేస్తుంది. ఎన్నికల సమయానికి ప్రస్తుత ప్రచారానికి తగ్గట్టు డబ్బులు అందకపోతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు వెనుకాడే పరిస్థితి నెలకొంది.