Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్నెస్ సెంటర్లో నిలిచిపోయిన వైద్య సేవలు
- తగ్గిన రోగులు సంఖ్య
నవతెలంగాణ-నల్లగొండ
ఆ సెంటర్లను ప్రారంభించే సమయంలో ఎంతో ఆర్భాటం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఇక మీదట ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పారు. వారి కోసం ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, దాంతో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తామని నమ్మబలికారు. ఐదు సంవత్సరాల కితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంతో ఆర్భాటంగా వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. పెద్దాసుపత్రులకు వెళ్లే ముందు రెఫరల్ సెంటర్‌గా, అదే విధంగా ప్రాథమికంగా అవసరమైన చికిత్స, కొన్ని మందులను కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు, అక్రిడియేషన్ కలిగిన జర్నలిస్టులు, వారి కుటుంబాల సభ్యులకు ఇక్కడే సేవలందించాలని నిర్ణయించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడి కూడా తగ్గి అక్కడ సామాన్యులకు కూడా మెరుగైన సేవలందుతాయని భావించారు. ప్రారంభంలో సేవలు బాగానే ఉన్నా.. అనంతరం వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో రోగులకు అవసరమైన ఆయా టెస్టులు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 150 టెస్టుల స్థానంలో కేవలం 50 వరకే టెస్టుల నమూనాలను సేకరించడం, టెస్టుల చేసే సౌకర్యాలను సెంట్రలైజ్డ్ పేరుతో వెల్ నెస్ సెంటర్ల నుంచి తెలంగాణ డయాగస్టిక్స్కు మార్చడంతో ఆ మిగిలిన 50 టెస్టులకు కేవలం నమూనాలు తీసుకునేందుకే సెంటర్లు పరిమితమయ్యాయి.
నిలిచిపోయిన రోగ నిర్ధరణ పరీక్షలు..
జిల్లాలో వెల్నెస్ కేంద్రాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో ఇక్కడ పూర్తిస్థాయి రోగ నిర్ధరణ పరీక్షలు, బ్రాండెడ్ కంపెనీల మందులతోపాటు దంత వైద్యం, ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు, పాత్రికేయులు ఈ కేంద్రంలో వైద్యసేవలు పొందేవారు. కానీ అధికారుల నిర్లక్ష్యం మూలాన రోగ నిర్ధారణ పరీక్షలు నిలిపి వేశారు. వెల్నెస్ సెంటర్లో లాక్డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాక్డౌన్ ముందు ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరే అందుబాటులో ఉన్నా స్పెషలిస్టులు ఎవరు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగికి వైద్యం చేయాలంటే రోగ నిర్ధరణ తప్పనిసరి. సాధారణ రక్త, మూత్రపరీక్షలతోపాటు ఖరీదైన థైరాయిడ్, కాలేయం, కిడ్ని పనితీరు, లిక్విడ్ ప్రొఫైల్, కీళ్లవాతం, యూరిన్ ప్రొఫైల్ లాంటి ఖరీదైన రోగ నిర్ధరణ పరీక్షలతోపాటు 50 రకాల రోగ నిర్ధరణ పరీక్షలు, లూసీడ్ అనే ప్రైవేట్ రోగ నిర్ధారణ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకొని పూర్తిగా ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం ఈ విధానానన్ని అధికారులు రద్దు చేశారు. రోగులుబీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులు దీర్ఘకాలికంగా వాడే బీపీ, షుగర్మాత్రలతోపాటు రోగ నిర్ధరణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఎంతో ఆశగా వస్తే తమకు సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చే జనరిక్ మందులు కాకుండా కేంద్రానికి వచ్చిన వారికి బ్రాండెడ్ కంపెనీల మందులు ఇచ్చేవారని ప్రస్తుతం కేవలం జలుబు, జ్వరం, మల్టీ విటమిన్ గోలీలు తప్ప అత్యవసర మందులు లభించడం లేదంటున్నారు.
తగ్గిను రోగుల సంఖ్య...
నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 150 మంది వరకు రోగులు వైద్యం కోసం వచ్చే వారని, సరైన వైద్యసేవలు, రోగనిర్ధరణ పరీక్షలు లేకపోవడం వల్ల వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో సేవలు అధ్వానంగా మారాయి. కరోనా వేళ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో వైద్యులతో పాటు ఔషధాలు అందుబాటులోకి తీసుకొస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ లచ్చూనాయక్ను నవతెలంగాణ చరవాణిలో సంప్రదించగా స్పందించలేదు.
జూనియర్ డాక్టర్లతో పరీక్షలు
-కేశబోయిన శంకర్‌ముదిరాజ్(విశ్రాంత ఉద్యోగి)
వెల్నెస్ సెంటర్లో గతంలో ఉద్యోగులకు, పెన్షన్ దారులకు సీనియర్ డాక్టర్లతో వైద్య పరీక్షలు జరిగేవి. లాక్డౌన్ తర్వాత జూనియర్ డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లో సీనియర్ డాక్టర్లు నియమించి మంచి వైద్యసేవలు అందించాలన్నారు.
పరీక్షలు చేయడం లేదు..
-నకెరకంటి కాశయ్యగౌడ్ (విశ్రాంత ఉద్యోగి)
వెల్నెస్ సెంటర్లో రోగులకు యాభ్కె రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయవలసి ఉంటుంది. రోగులకు డాక్టర్లు అలాంటివి ఏమీ చేయడం లేదు.కేవలం దగ్గు, జ్వరం, షుగర్, వ్యాధులకు సంబంధించిన ట్యాబ్లెట్లను రోగులకు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు .మిగతా ట్యాబ్లెట్లను వైద్యులు బయటికి రాస్తున్నారు.రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు అందించి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలన్నారు.
అసౌకర్యాలు కలుగకుండా చర్యలు..
-కొండలరావు(డీఎంహెచ్‌వో)
వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులకు, పెన్షన్ దారులకు, జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరత వల్ల రోగ నిర్ధారణ పరీక్షలు చేయలేక పోతున్నాం. రోగులకు ప్రభుత్వం సప్లైరు చేస్తున్న మందులనె రోగులకు అందిస్తున్నాం.