Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలోని సర్వే నంబర్ 60లో ఉన్న వదర్ల గుట్టను మైనింగ్ (క్రషర్) కు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ గురువారం ఆ గ్రామ రైతులు తహసీల్దార్ షేక్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుట్ట చుట్టూ సుమారు వంద మంది రైతుల భూములు ఉన్నాయని, మైనింగ్ తో పంటలు దెబ్బతింటాయని, నీరు కలుషితమవుతుందని, దుమ్ము, ధూళితో రైతులు,పశువులు అనారోగ్యాల భారిన పడతాయని తెలిపారు. గుట్టను కళ్లంగా వాడుకుంటున్నామని, గుట్టపైన, చుట్టూతా సుమారు 15 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటగా చెట్లు పెరిగాయన్నారు. నెమళ్లు, ఇతర వన్య ప్రాణులకు గుట్ట నివాస ప్రాంతంగా ఉందని, పశువులకు మేత దొరుకుతుందని, మైనింగ్ తో ప్రకృతి దెబ్బతిని భూములు బీడువారి తమ వ్యవసాయం దెబ్బతిని జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ, గ్రామస్తుల అనుమతి లేకుండా మైనింగ్ కు ఎలా అనుమతి ఇస్తారని, వెంటనే వదర్ల గుట్ట మైనింగ్ ను రద్దు చేయాలని చేయాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్ కుకూడా వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎన్.మత్స్యగిరి, పి.వెంకట్ రెడ్డి, ఎస్.లక్ష్మీ నర్సింహారెడ్డి, బి.వెంకట్ రెడ్డి, సత్తిరెడ్డి, యాదిరెడ్డి, సత్తయ్య, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.