Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఆత్మకూరు ఎస్
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు సభ లో ధ్వజమెత్తారు. గ్రామపంచాయతీలో వీధి దీపాలకు ఆన్ ఆఫ్ స్విచ్ లేక పోవడం తో విద్యుత్ వృధాఅయి గ్రామపంచాయతీ నిధులు విద్యుత్ శాఖ పాలవుతున్నాయని సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటి పైపులు లీకై గ్రామాల్లో వీదులు బురద మయంగా మారుతున్నాయి అన్నారు. వచ్చేనెల సన్న బియ్యం ఇస్తామంటూ వేలు ముద్రలు డీలర్లు వేయించుకొని రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంటూ సభ్యులు ధ్వజమెత్తారు. పాఠశాల భవనాల్లో అదనపు తరగతి గదులు నిర్మించి ఏళ్లు గడుస్తున్న బిల్లులు ఇవ్వడం లేదని దుబ్బ తండా సర్పంచ్ రవీందర్ నాయక్ ఆరోపించారు. విద్యుత్ బిల్లులు సరైన సమయానికి నమోదు చేయకపోవడంతో ఎక్కువ యూనిట్లు నమోదయి అడ్డగోలుగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. పశువులకు వచ్చే ముద్ద ధర్మ వ్యాధి ప్రాణాంతకం కాదని తెల్లజాతి పశువుల్లో మాత్రమే ఈ వ్యాధి వస్తుందని పశువైద్యాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్సూర్ నాయక్, తహశీల్దార్ హేమమాలిని,వైస్ ఎంపీపీ వెంకన్న, ఎంఈఓ ధారాసింగ్,ఏఈ లు,రవికుమార్ బాబురావు, గౌతమ్, ఏవో దివ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.