Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యాక్సీప్లేట్ ఫోర్ వీలర్ అసోసియేషన్ యూనియన్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద ప్రయివేటు కార్ల స్టాండ్‌ను ఏర్పాటు చేసిన అడ్డాను తొలగించాలని ట్యాక్సీప్లేట్ ఫోర్ వీలర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేట నుండి ఎల్బినగర్ వరకు ఆర్టీసీ బస్టాండ్ మూల మీద ఎలాంటి అనుమతి లేకుండా మరికంటి అంబేద్కర్, పెరుమాళ్ల అంబేద్కర్ షెట్టర్ కిరాయికి తీసుకొని నెలకు 20 వేలు అద్దె చెల్లిస్తూ స్టాప్ పాయింట్ ఏర్పాటు చేసి ప్రతిరోజు స్టేజీ క్యారియర్ సర్వీసు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు వంద కార్లను నడుపుతున్నారని, ఇవి కాక హైదరాబాద్ నుండి వస్తున్న సుమారు 40 వాహనాలకు కూడా పైసలు తీసుకొని అదే స్థానంలో పెట్టి హైదరాబాద్ ప్యాసింజర్లను నింపి పంపిస్తున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ పార్క్ చేసే వాహనాల యజమానుల దగ్గర నుండి నెలకు ఒక వేయ్యి రూపాయలు, ప్రయాణికులను ఎక్కించడానికి ప్రతి రోజు రూ.50 వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా కొత్త వాహనం వస్తే అక్కడ అడ్డా మీద పెట్టడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇదేమిటని అడిగితే డబ్బులను ఆర్టీసీ అధికారులకు, అక్కడ డ్యూటీ చేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసులకు నెల మామూలు ఇవ్వాలని వారు చెప్తున్నారని ఆరోపించారు. మోటర్ వెహికల్స్ యాక్ట్ 185(2)111 ప్రకారం ఆర్టీసీ బస్టాండ్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఎలాంట ప్రయివేటు వాహనాలు స్టేజీ క్యారియర్ చేయకూడదని, అందుకు భిన్నంగా బస్టాండ్ కి కేవలం వంద మీటర్ల దూరంలోనే హైటెక్ బస్టాండు కు సమాంతరంగా వారు కార్ల స్టాండ్ నడుపుతున్నారని ఆరోపించారు. వారిపై ఆ వాహనాలపై ఎందుకు ఆర్టీసీ చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనివలన ఆర్టీసీ కి భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. వీరు చేసే స్టేజి క్యారియర్ వల్ల తమకు కిరాయిలు రాకుండా పోయయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్ మూల మీద వాహనాలు నిలపడం ద్వారా స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లే వారు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ, పోలీసు అధికారులు స్పందించి ఇలాంటిప్రయివేటు కార్లస్టాండు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.