Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం, అర్బన్ సెంటర్స్ ఏఎన్ఎంలు, ఇతర ఏఎన్ఎం అందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) మహిళా కన్వీనర్ జీ.ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్లో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా రోల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ, రోస్టర్ పద్ధతిలో నియమించబడి గత 15 -20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించినందున ఎన్ హెచ్ ఎం రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, ఇతర యూనియన్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. సబ్ సెంటర్ అద్దె, స్టేషనరీ జిరాక్స్ ఖర్చులు, ఫీల్డ్ డ్యూటీ ఉన్నందున ఎఫ్టీఏ సౌకర్యం కల్పించాలని,హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, వివిధ పిహెచ్సిల ఏఎన్ఎంలు సైదమ్మ ,జ్యోతి, నిర్మల, జయమ్మ, శైలజ ,పద్మ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.