Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ కార్మికులందరికీ వర్తింపజేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెల్ది రాములు డిమాండ్ చేశారు. గురువారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని, దానిని మునుగోడు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలని, చేతినిండా పనిలేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్న కార్మికులకు రుణమాఫీ అమలు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. నూలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీని రద్దు చేయాలని, నూలుపై ఇస్తున్న 40శాతం సబ్సిడీ కోసం దరఖాస్తుచేసుకోవడానికి పెట్టిన వెబ్ సైట్ మూడు నెలలుగా పని చేయడం లేదని, దానిని వెంటనే పునరుద్ధరించి కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వంఅనుసరిస్తున్న విధానాలతో చేనేత సంక్షోభంలో కూరుకుపోతుందని, కార్మికులకు వర్తించే అనేక పథకాలు రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను దెబ్బతీసి కార్మికుల పొట్ట కొడుతున్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో చేనేత కార్మికులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి రాములు, గోపయ్య పాల్గొన్నారు.