Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువు
- ఇబ్బందుల్లో రోగులు
- సమయపాలన పాటించని డాక్టర్లు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -తుంగతుర్తి
దశాబ్దాల క్రితం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నాడు రోగులతో కిటకిటలాడేది,నేడు డాక్టర్లున్న రోగులు లేక వెలవెలబోతుంది.పేరుకే 30 పడకల ఆసుపత్రి. కానీ ఒక్కపడక సరిగ్గా లేదు. 24 గంటలు పేదలకు వైద్యం చేయడానికి సిబ్బంది వైద్యులు ఉండాలి. పేరుకే 24గంటల ఆసుపత్రి, ఆరుదాటితే ఒక్కరు ఉండరు. వైద్యులందరికీ ప్రయివేటు క్లినిక్‌లు ఉండడం చేత అక్కడే గడిపేస్తున్నారు. ఎలాగో ఇక్కడ జీతం వస్తుంది కదా అన్న ధీమాతో అక్కడే పూర్తి టైం కేటాయిస్తున్నారు.
ఆరుగురి డాక్టర్ల కు గాను రోజుకు ఒకరు చొప్పున విధులు
ఆస్పత్రిలో అందరూ డాక్టర్లు ఆరుగురు విధులు నిర్వహించాల్సి ఉండగా రోజుకు ఒకరి చొప్పున విధులకు హాజరవుతున్నారు. మిగతావారు సొంత క్లినిక్‌లో నిమగమయ్యారు. ఆస్పత్రిలో మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్ తప్ప మిగతా వారెవరు విధులకు హాజరు కావడం లేదు.
రక్త పరీక్షలు నిల్
వైద్యానికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు నిర్వహించడానికి నియమించబడిన సిబ్బంది సైతం, సొంత ల్యాబ్ లలో నిమగం అవుతున్నారు. రసాయనాలు లేవని పరీక్షలు ఎలా చేయడం జరుగుతుందని తమ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆస్పత్రికి పక్కా భవనం ఉన్నా అన్ని సమస్యలే
హాస్పటల్లో ఆపరేషన్ థియేటర్ ఉన్న ఆపరేషన్ చేసిన దాఖలు లేవు.ఎక్స్‌రే మిషన్ ఉన్న ఎక్స్‌రే తీసిన దాఖలాలు లేవు.ఆయుష్ విభాగానికి సంబంధించి కాంపౌండర్,డాక్టర్ ఇద్దరు ఉన్న మందులు సరిగా ఉండకపోవడంతో వాటి కోసం వచ్చే వారే కరువయ్యారు.
తుంగతుర్తి ఆస్పత్రి పరిధిలో మొత్తం 10 సబ్ సెంటర్లు ఉండగా, ఏఎన్ఎం పోస్టులన్నీ ఖాళీగా ఉండడం చేత, రెగ్యులర్ ఏఎన్ఎం లు లేకపోవడంతో 9 మంది సెకండ్ ఏఎన్ఎంలతోనే నడపడం జరుగుతుంది.
ఎమ్మెల్యే సందర్శించిన మారని సిబ్బంది తీరు
గత కొంతకాలంగా తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నిధులు కేటాయించి కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం స్పందించి ఆసుపత్రికి నిధులు కేటాయించి అభివృద్ధిపరిచి ఆసుపత్రిలో కాన్పులు జరిగే విధంగా కృషిచేసి పేద ప్రజలను ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి
బుర్ర శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
ప్రభుత్వాస్పత్రిలో కనీస సౌకర్యాలు కల్పించలేని దయనీయ స్థితి కొనసాగుతుంది. వసతులు సక్రమంగా లేకపోవడంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. రాజకీయనాయకులు మారుతున్నారే తప్ప ఆస్పత్రి స్థితిగతులు మారడం లేదు. ఆస్పత్రి ఆవరణం అంతా బురదమయంగా పందుల స్థావరంగా ఉంటుంది. మురుగునీరు నిల్వ ఉండడం చేత దుర్గంధం వస్తుంది,ఆస్పత్రి ప్రాంగణాన్ని మొత్తం శుభ్రపరచి రోగులు స్వేద తీర్చుకునేలా మంచి వాతావరణం కల్పించాలి. వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించాలి.
సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే..
మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. కొన్నేండ్లుగా ఏఎన్ఎం పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎంలతోనే కొనసాగిస్తున్నాం. ఆస్పత్రిలో పందుల సంచారంపై పలుదాపాలుగా ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసినప్పటికీ ఫలితం లేదు. గతంలో ఆస్పత్రి గేటు బాధ్యతలు తీసుకున్న ఆర్ అండ్‌బీ ఏఈ బదిలీపై వెళ్లడంతో అలాగే పెండింగ్‌లో ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పనులను పూర్తి చేస్తున్నాం.