Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
- నిఖిల్ హత్య పై ప్రత్యేక దర్యాఫ్తు జరిపించాలి
- దళిత,గిరిజన,ప్రజా సంఘాల రాష్ట్ర నాయకుల డిమాండ్
నవ తెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన యువకుడు, న్యాయ శాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ హత్య పై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు,డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ డిమాండ్ చేశారు. నిఖిల్ హత్య జరిగి 20 రోజులు గడుస్తున్న నేటికీ పోలీసులు నిందితులను గుర్తించకుండా కేసులో చేస్తున్న జాప్యానికి నిరసనగా గురువారం కేవీపీఎస్, తెలంగాణ గిరిజన సంఘం, డివైఎఫ్ఐ, ఆల్ ఇండియా బంజారా సంఘం, గిరిజన శక్తి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపసంచాలకులు చంద దాస్, మానవ హక్కుల కమిషన్ కు నిఖిల్ తండ్రి దరావత్ భాస్కర్ చేత ఫిర్యాదు చేయించిన అనంతరం వారు మాట్లాడారు. యువ లాయర్ ధరావత్ నిఖిల్ ది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని వారు ఆరోపించారు. హత్య జరిగి ఇరవై రోజులు కావస్తున్న ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడం పోలీసుల వైఫల్యమేనని అన్నారు. దీనికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన యువకుడు కావడం వల్లనే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ధరావత్ నిఖిల్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని వారే సుపారీ ఇచ్చి తన స్నేహితుల సహకారంతో హత్య చేయించినట్టు కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్న, పోలీసులు ఆ వైపు విచారణ జరపకుండా కేవలం స్నేహితుల మధ్య తగాదాగా చిత్రీకరించి ఆత్మహత్య కోణంలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం అన్యాయమని విమర్శించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు టెక్నాలజీ పరంగా ప్రథమ స్థానమని చెప్పుకునే ప్రభుత్వం నిఖిల్ హత్య జరిగి 20 రోజులు కావస్తున్న దుండగులను ఎందుకు గుర్తించలేదో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండురోజుల్లో హత్య చేసిన దుండగులను పట్టుకోకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్,జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.త్వరలోనే దళిత, గిరిజన ప్రజా సంఘాలను సంప్రదించి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సంఘం జిల్లా ఇన్చార్జ్ ధరావత్ వీరన్న నాయక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, గిరిజన శక్తి నాయకులు వెంకటేష్ నాయక్, గిరిజన సంఘాల నాయకులు డాక్టర్ ఆనంద్ నాయక్ , జితేందర్ నాయక్, ధర్మానాయక్,మంగతా నాయక్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.