Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుగా బెట్టింగ్ దందా
- మాఫియాపై పోలీసుల ఫోకస్
మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక పై ఉంది. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది? ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని చేయడంతో మునుగోడులో మొనగాడు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. ఇక ఆ చర్చ అంతటితో ఆగక జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడే దాకా వెళ్లింది.
నవతెలంగాణ- నల్లగొండ
మునుగోడు ఉప ఎన్నిక పై ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మునుగోడు పై జెండా ఎగురవేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నదానిపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ముఖ్యంగా పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని భావిస్తున్న క్రమంలో గెలిచేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని కోట్లలో బెట్టింగ్‌లు వేస్తున్నారు. బెట్టింగ్ మాఫియా మరికొందరు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో విజయం సాధిస్తాడని బెట్టింగ్ పెడుతున్నారు. ఇక ఈ బెట్టింగ్ మాఫియా మునుగోడు గడ్డమీద దందా సాగించడానికి ఏజెంట్లను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మునుగోడుతో పాటుగా చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఏజెంట్లను నియమించుకుని తమ దందా సాగిస్తున్నారు. ఈ ముఠా ఎవరికీ పట్టుబడకుండా ఆన్ లైన్ ట్రాన్జాక్ష్షన్స్ ద్వారా దందా సాగిస్తున్నట్టు సమాచారం. కోట్ల రూపాయల బెట్టింగ్ దందా మొదలైందని సమాచారం.
మాఫీయాపై పోలీసుల పోకస్
మునుగోడు పై ఫోకస్ పెట్టి బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగిందని పోలీసులకు అందుతున్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ మాఫియాపై నిఘా పెట్టింది. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు .