Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
నవతెలంగాణ- ఆలేరు టౌన్
అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు .నవంబర్ 20, 21 తేదీల్లో భువనగిరిలో జరుగనున్న అంగన్వాడీ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభల జయప్రదం చేయడం కోసం ఆలేరు సెక్టార్ల అంగన్వాడీలు మండల కేంద్రంలో శుక్రవారం విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ అయిన భువనగిరిలో అంగన్వాడీ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా సభకి ఎంపిక చేయబడ్డ 500 మంది ప్రతినిధులు రానున్నారని తెలిపారు. రెండు రోజుల పాటు వారికి భోజనం, బస తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. మహాసభ ప్రారంభం రోజున బహిరంగసభ నిర్వహిస్తున్నామన్నారు. టీచర్లు, ఆయాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీిఎస్కు వ్యతిరేకంగా తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా, ఐసీడీఎస్ రక్షణ కోసం రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు రూప కల్పన చేయనున్నామన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మాదిరిగా అంగన్వాడీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు రమాకుమారి, సిఐటియు మండల కన్వీనర్ మొరిగాడి రమేశ్, యూనియన్ నాయకులు ఎనుగుల పద్మ, లక్ష్మి, అనురాధ, శారద, అరుణ, రేణుక, వహీదబాను, బాలమణి, ఫాతిమాబేగం, సంతోష, పుష్పలత పాల్గొన్నారు.