Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు కోసం ఎన్నికలు తెచ్చిన రాజగోపాల్‌కు బుద్ధి చెప్పాలి
- మునుగోడు అభివృద్ధి కోసం ఈసారి టీఆర్ఎస్నే గెలిపించాలి
- కాంగ్రెస్‌కు ఓటేస్తే ఓట్లు చీలి బీజేపీకి లబ్ది.. టీఆర్ఎస్కు నష్టం
- మునుగోడులో మెజారిటీ ప్రజల ఆలోచనా ధోరణి ఇలాగే ఉంది
- గౌడ కులస్తులు, కమ్యూనిస్టులు టీఆర్ఎస్ వైపే మొగ్గు
మునుగోడు ఉపఎన్నిక రసకందాయంలో పడింది. పోలింగ్‌కు ఇక ఐదు రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం మునుగోడు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదం టీఆర్ఎస్కే అనుకూలించే చాన్స్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాల నాయకులు కూడా ఓటింగ్ విషయంలో తమ వర్గ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మెజారిటీ ప్రజలు 'ఆజ్ టీఆర్ఎస్.. కల్ కాంగ్రెస్.. బీజేపీ ఖతం' అనే నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి కారణమూ లేకపోలేదు.. అదేంటంటే..
నవతెలంగాణ-ఆలేరు
మునుగోడు నిజానికి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అక్కడి ప్రజలు కాంగ్రెస్‌పై అభిమానంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ.. ఆయన ఇక్కడి ప్రజల నమ్మకాన్ని రూ.18 వేల కోట్ల మైనింగ్ కాంట్రాక్టు కోసం బీజేపీ నాయకుల ముందు తాకట్టు పెట్టారు. అందుకే మునుగోడు ప్రజలు రాజగోపాల్‌పై పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఆయనను గెలిపిస్తే కమ్యూనిస్టుల గడ్డ అయిన మునుగోడులో బీజేపీకి బీజం నాటినట్లు అవుతుందని భయపడుతున్నారు. తన కాంట్రాక్టు కోసం ఉప ఎన్నికను సృష్టించిన రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని శపథం పూనారు. అంతేకాదు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడు కాస్త అయినా అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తమ నియోజక వర్గానికి శఠగోపం పెట్టి ఆయన మరో కాంట్రాక్టు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని మునుగోడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గౌడ సామాజిక వర్గానికి గెలుపోటములను నిర్ణయించే శక్తి..
మునుగోడులో అత్యధికంగా 35,150 ఓట్లు (15.94 శాతం) గౌడ సామాజిక వర్గానికి చెందినవే. వీళ్లు గెలుపోటములను నిర్ణయించే శక్తి కలిగి ఉన్నారు. అందుకే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీ లాక్కెళ్లింది. అయితే.. కాంగ్రెస్ నుంచి పల్లె రవికుమార్ గౌడ్, బీజేపీ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్లో చేరి గులాబీ పార్టీకి డబుల్ బొనాంజా ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి జంప్ అయ్యారు. రవికుమార్ గౌడ్, భిక్షమయ్య గౌడ్ మాత్రం తమ సామాజిక వర్గం నాడిని పసిగట్టి గులాబీ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయాలని గౌడ సామాజిక వర్గ ప్రజలకు గౌడ ఐక్య సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణగాని శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. 'రైతు బంధు ప్రకటించిన కేసీఆర్ రైతుల హృదయాల్లో స్థానం సంపాదించారు. పెన్షన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. వైన్స్‌ల్లో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వ్ చేయడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. కాంట్రాక్టు కోసం ఎన్నికలు సృష్టించిన రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. టీఆర్ఎస్ను గెలిపించి నియోజక వర్గ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలి' అని శంకర్ గౌడ్ సూచించారు.
కమ్యూనిస్టులకూ బలమైన ఓటు బ్యాంకు..
మరోవైపు గట్టుప్పల్ మండలాన్ని కేసీఆర్ ప్రకటించడంతో ఆ మండల ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు జై కొడుతున్నారు. కమ్యూనిస్టుల ఖిల్లా అయిన మునుగోడులో సైద్ధాంతిక శత్రువైన బీజేపీకి చోటు దక్కకుండా చేస్తామని కమ్యూనిస్టు కార్యకర్తలు, సానుభూతిపరులు ధీమాతో ఉన్నారు. కమ్యూనిస్టులకు కూడా ఇక్కడ 30 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో ఆ పార్టీకి ఓట్లేస్తే బీజేపీకి లబ్ధి జరుగుతుందని వాళ్లు భయపడుతున్నారు. అందుకే.. నోట్లతో ఓట్లు కొంటామన్న ధీమాతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలంటే ఈసారి టీఆర్ఎస్కు ఓటేయక తప్పదని కమ్యూనిస్టు, కాంగ్రెస్ సానుభూతిపరులు భావిస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ను గెలిపించాలని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని.. మునుగోడులో బీజేపీని ఖతం చేయాలని కంకణం కట్టుకున్నారు.