Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి, మునుగోడు మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత స్వలాభం కోసం రాజీనామా చేశారన్నారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రజలు రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని, కేసీఆర్ ప్రభుత్వం భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మునుగోడు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో కమ్యూనిస్టు కార్యకర్తలు కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే భారత కమ్యూనిస్టు పార్టీ గెలిచినట్టే అని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. అంజయ్య చారి, తెలంగాణ ప్రజానాట్యమండలి పల్లె నరసింహ, జిల్లా మహిళ సమైక్య కన్వీనర్ గిరి రమ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జనంపాట జగన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహరావు, సిపిఐ మాజీ ఎంపీపీ మేకల కిషోర్, సిపిఐ మండల కార్యదర్శి రమేష్ , తదితరులు పాల్గొన్నారు.