Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం ఓటు
- చండూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తాం
- 15 రోజుల్లో అన్ని పనులూ చేస్తాం
- జగదీశ్ రెడ్డి పై ఈసీ చర్యలు దారుణం
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
నవతెలంగాణ -నల్లగొండ
మునుగోడు ఉప ఎన్నికల్లో ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది... చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో సీపీఐ(ఎం), సీపీఐ మద్దతుతో నిలబడిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలుపుకోసం ఆదివారం చండూరు మండలంలోని బంగారుగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ మంచి, చెడు ఆలోచించి ఓటు వేస్తే బతుకులు బాగుపడ్తాయని, మునుగోడు బాగుపడుతుందని అన్నారు. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అవసరం లేకుండానే వచ్చిందన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేల్చేశారు.. అది కూడా తెలుసు... కొత్తగా చెప్పడానికి ఏం లేదు అని అన్నారు. ఒక నాలుగు విషయాలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చానన్నారు. 'ఎలక్షన్లు వస్తాయి... ఎన్నికలు రాగానే ఏందో ఏమో మాయరోగం పట్టుకుంటుంది... గత్తర గత్తర లొల్లి లొల్లి ఉంటది... కొందరైతే గజం ఎత్తున గాల్లోనే నడుస్తున్నారు... విచిత్ర వేషాధారులు.. అనేక పార్టీలు వస్తున్నాయి..చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను... ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దు. మీ ఊరెళ్లిన తర్వాత చర్చ చేసి నిజనిజాలు తేల్చాలి' అని అన్నారు. దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఏం జరుగుతుందో మనసు విప్పి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. దేశంలో చైతన్యం రానంత వరకు దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతాయన్నారు. దోపిడీదారులు మాయమాటలు చెప్పి మోసం చేస్తారన్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టకపోతే.. నో మ్యాన్ జోన్ అవుతది.. అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందన్నారు. ఆనాడు రాష్ట్ర పాలకులుగానీ, దేశ పాలకులు గానీ పట్టించుకోలేదని తెలిపారు. కానీ, స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంతో వందశాతం ఇండ్లకూ మంచినీరు అందిస్తున్నామన్నారు.నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుకున్నామని ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దన్నారు. ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే 15 రోజుల్లో చండూరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చి చండూరులో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గం లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయిస్తానని తెలిపారు.
జగదీశ్ రెడ్డి పై ఈసీ చర్యలు దారుణం
మంత్రి జగదీశ్ రెడ్డి పై ఈసీ చర్యలు దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 20 ఏండ్లలో ఏనాడూ జగదీశ్ రెడ్డి లేకుండా ఏ సభలో తాను మాట్లాడలేదన్నారు. ఈ రోజు చండూరు కు బాధగా వచ్చిన.. సభలో జగదీష్ రెడ్డి లేకపోతే బాధ అనిపిస్తుందన్నారు. 2001 నుండి ఉద్యమ నాయకుడిగా జగదీశ్ రెడ్డి తనతోనే ఉండు అని తెలిపారు. ఏం దాదాగిరి, గుండా గిరి చేసిండని జగదీశ్ రెడ్డి పై నిషేదం విధించారని ప్రశ్నించారు. అయన ప్రచారం చేసుకోవడం తప్పా అన్నారు. జగదీశ్ రెడ్డిని పంపించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి మునుగోడు ప్రజలు కుట్రను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కంచనపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు రవీందర్ కుమార్ నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మైనంపూడి సైదిరెడ్డి, గొంగిడి సునీత, సీనియర్ నాయకులు మోతుపల్లి నర్సింలు, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్,
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సీపీఐ రాష్ట్ర నాయకులు యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రాంతానికి సేవకునిగా పని చేస్తా
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు : నవంబర్ 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే ఈ మునుగోడు ప్రాంతానికి సేవకునిగా పని చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆశీర్వదించి తనకు టికెట్ ఇచ్చారని, కేసీఆర్ అభయంతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రాంగణంలో ఇంతమంది జనాన్ని చూస్తుంటే తన గెలుపు కనబడుతుందన్నారు. టీిఆర్‌ఎస్ జోష్ కనబడుతుందన్నారు. మతోన్మాదమైన బీజేపీని ఈ మునుగోడు గడ్డ నుంచి పారదోలాలన్నారు. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పనులను, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను చేసుకుందామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.పలువురు కార్యకర్తలు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫొటోలు దిగారు, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
పాదయాత్రతో ఎమ్మెల్యే నోముల భగత్
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గులాబీ శ్రేణులతో కలిసి కేసీిఆర్ సభకు ఐదు కిలోమీటర్ల పాదయాత్రతో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో వివక్షకు గురై మనకోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్నారు.
కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి రక్ష
రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని ఎమ్మెల్యే పద్మజ దేవేందర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె అన్నారు. సోమవారం ఆమె సీఎం కేసీఆర్ బహిరంగ సభలో సామాన్య వ్యక్తులకు కూర్చుని అనంతరం విలేకరులతో మాట్లాడారు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అభ్యర్థిని గెలిపిస్తారు అన్నారు. ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ గెలవాన్నారు.
ప్రజలతోకలిసి సభలో కూర్చున్న మంత్రులు
మర్రిగూడ : మునుగోడు ఉపఎన్నికలలో భాగంగా చండూరు మండలం బంగారుగడ్డలో జరిగిన బహిరంగ సభలో ి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలతో కలిసి కూర్చొని తిలకించారు.