Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎన్నికల అధికారి టీ.వినరు కృష్ణారెడ్డి
నవ తెలంగాణ- చండూరు
నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలలో పోలింగ్ కేంద్రానికి ఓటర్లు ఎపిక్ కార్డు లేదా ఇతర 12 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒక దానిని విధిగా తీసుకురావాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి టీ.వినరు కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం చండూరు మండలం డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం నోడల్ అధికారులు, తహశీల్దార్లు,సెక్టార్ అధికారులతో పోలింగ్ ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు పై సమీక్షించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డుగా పోలింగ్ సిబ్బంది పరిగణించరాదని, దానితోపాటు ఫోటో స్పష్టంగా ఉన్న, అక్షర దోషం లేని ఎన్నికల గుర్తింపు కార్డు అయిన ఎపిక్ కార్డును ను కచ్చితంగా ఓటర్ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో లేకుంటే ఎన్నికల సంఘం ప్రకటించిన 12 కార్డులలో ఏదైన ఒక కార్డు తీసుకురావాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన తదితర విషయాలపై సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్ రావు, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్, నల్గొండ అర్.డి.ఓ జయ చంద్రరెడ్డి, జడ్పీ సీఈవో ప్రేంకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.