Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ కుట్ర
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చండూర్
సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తు నేడు (మంగళవారం)చౌటుప్పల్ నుండి మునుగోడు వరకు జరుగుతున్న బైక్ ర్యాలీని జయప్రధం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గట్టుప్పల్ నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుద పోరాటాన్ని హిందూ -ముస్లీం ఘర్షణగా వక్రీకరించి ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ మతోన్మాద, అరాచాక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతి శీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి మునుగోడు ఉపఎన్నికలలో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమకు ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రయివేట్ వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారిఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, మండల కార్యదర్శి బొట్టు శివకుమార్, గ్రామశాఖ కార్యదర్శి కర్నాటి సుదాకర్, ఖమ్మం రాములు, నాయకులు పెద్దగోని నర్సింహ్మ, కుక్కుడాల కైలాసం, ముసుకు బుచ్చిరెడ్డి, కర్నాటి మహేందర్, నల్లగంటి బిక్షం, ఎండీ. రబ్బాని, తదితరులు పాల్గొన్నారు.