Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు చెప్పినా వినని మద్యం షాప్ యజమానులు
- వైన్‌షాపుల్లో కల్తీ మద్యం?
- బలి పశువులుగా బెల్ట్‌షాప్ యజమానులు
నవతెలంగాణ-నాగారం
నాగారం మండలపరిధిలో విచ్చల విడిగా మద్యం దందా కొనసాగుతోంది. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులలో మద్యం ఫుల్ బాటిల్ అమ్మొద్దని, అమ్మితే 2లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.అయినా ఇది అమలు కావడం లేదు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గత నెలలో నాగారం తహసిల్దార్ ముందు బెల్ట్ షాప్ నిర్వాహకులను ఇదే విషయమై బైండోవర్ చేశారు. ఇదే సందర్భంలో బెల్ట్ షాపులో మద్యం ఫుల్ బాటిల్ అమ్మినట్లయితే రెండు లక్షల రూపాయల జరిమానా విధించబడుతుందని ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నారు. ఈ ఒప్పందం రాయించుకొని 15 రోజులు గడవక ముందే వైన్‌షాప్ నిర్వాహకులు మాత్రం మద్యం ఫుల్ బాటిళ్లను బెల్ట్‌షాపు నిర్వాహకులకు అమ్ముతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఒప్పంద పత్రాలు రాయించడానికే పరిమితం అయ్యారు తప్ప అనంతరం జరిగే పరిణామాలపై మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మామూళ్ల కోసం మాత్రమే నెలకు ఒకసారి నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వైన్ షాప్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాగారం మండల కేంద్రానికి రెండు వైన్ షాపులు మంజూరైనాయి. రెండు షాపులకి రెండు పర్మిట్ రూములు, రెండు వినియోగదారుల కౌంటర్లు, రెండు బెల్ట్ షాప్ కౌంటర్లు నిర్వహించాల్సి ఉండగా ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఒకే పర్మిట్ రూము ఒక వినియోగదారుల కౌంటర్, ఒక బెల్ట్ షాప్ కౌంటర్ మాత్రమే నిర్వహిస్తున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. దీనికి తోడు అధికారుల నిఘా లేకపోవడంతో వైన్‌షాప్ లోనే మద్యం కల్తీ జరుగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై దాడి నిర్వహిస్తే బలి పశువులుగా మారేది బెల్ట్ షాపు యజమానులు మాత్రమే అని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగా స్పందించి వైన్స్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, బెల్ట్ షాప్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
వైన్‌షాప్ యజమానుల దాడులు సరికాదు
గత అక్టోబర్ నెలలో బెల్ట్ షాప్ నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ అధికారులు తాసిల్దార్ కార్యాలయం ముందు బైండోవర్ చేసి రెండు లక్షల జరిమానా పత్రంపై సంతకం చేయించుకున్నారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులకు బదులు వైన్స్ షాప్ యజమానులు దాడులు నిర్వహించడం ఏమిటని బెల్ట్ షాపు నిర్వహకుడు మంగళపల్లి రాజిరెడ్డి ప్రశ్నించారు.