Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తాడంట
- మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బెంగాల్ ప్రయోగం
- అమిత్‌షా ఆదేశాలతోనే ఉద్రిక్తతలు
- కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం
- ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో రేవంత్‌రెడ్డి
- కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి
నవతెలంగాణ-నల్లగొండ
అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తానని చెప్పితే ఎవరైనా నమ్మేవారు ఉన్నారా.. మాయమాటలు విడ్డూరంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి మారాలని ఎవరైనా బెదిరిస్తే వాళ్లు ఎంతటి వాళ్లైనా వీపు విమానం మోత మోగుతుందని హెచ్చరించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో 50వేల మంది మహిళలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆడబిడ్డల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల రూపంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. ఏనాడూ ఆడ బిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదని తెలిపారు. ఈసారి పాల్వాయి స్రవంతిని కడుపులో పెట్టుకుని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీదని చెప్పారు.2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరు పోసినా తన్నండని మహిళలకు పిలుపునిచ్చారు. అమిత్‌షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఉద్రిక్తతలు సృష్టించి రెండు పార్టీల ఎన్నికల పోలరైజేషన్ కోసం పని చేయబోతున్నాయంటూ కామెంట్లు చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఈ రెండు పార్టీల మధ్య పోలరైజేషన్‌కు కుట్ర పన్నారని ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటలను ఉరేయ బోతున్నట్టు హడావుడి చేశారని, ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులు ఎత్తుకెళ్లాయని తెలిపారు. మునుగోడులో సైతం అదే కుట్ర చేయబోతున్నారని చెప్పారు.రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే చీర నేసే పని కూడా సిరిసిల్లకే పోతుందని చెప్పారు. ఈ విషయంమై పద్మశాలీ సోదరులు ఆలోచించాలనారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గత ప్రజాప్రతినిధులు పశువులలాగా అమ్ముడుపోయారని ఆరోపించారు. అమ్ముడు పోయిన నేతలను ఆదరించొద్దని కోరారు. అభివద్ధి ఎలా జరుగుతుందో రాజగోపాల్ రెడ్డికే తెలియాలన్నారు.
కంటతడి పెట్టిన స్రవంతి..
రెండు నెలల నుంచి బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆడబిడ్డని అని చూడకుండా తనను అడ్డుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కంటతడి పెట్టుకున్నారు. నామినేషన్ వేసిన సమయంలో చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి, ప్రచార సమయంలో కాంగ్రెస్ కార్యకర్తల తలలను పగలగొట్టారని కన్నీరు పెట్టుకున్నారు. కొందరు నాయకులు డబ్బుకు రాజకీయాలు చేస్తే.. మా నాన్న ప్రజల సమస్యలపై రాజకీయం చేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, నేతలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీహార్ రాజ్యసభ సభ్యులు రంజిత రంజన్, తమిళనాడు పార్లమెంట్ సభ్యులు జ్యోతిర్మయి, పీసీసీ అధికార ప్రతినిధులు భవానిరెడ్డి, పున్న కైలాస్ నేత, జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సతీమణి సృజమణి తదితరులు పాల్గొన్నారు.