Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
కాంట్రాక్టు కోసం 18వేల కోట్ల రూపాయలకు బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గట్టు శ్రీరాములు ఫంక్షన్హాల్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు, స్వార్థ ప్రయోజనం కోసం మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలుచేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ మతోన్మాద ఎజెండా, ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలు రెచ్చగొట్టి విభజన రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలపై అనేక భారాలు మోపుతుందని విమర్శించారు. పేద ప్రజలపై పన్నులు వేస్తూ ప్రజల మూలుగలను పీల్చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేస్తుందన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తుందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను హౌల్సేల్గా అనేక ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తుందన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం తక్షణ అవసరమన్నారు. బీజేపీని ఓడించకపోతే మునుగోడు, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికే పెద్ద ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొని ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు నోటి దురుసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దీనికి ప్రజలే గుణపాఠం చెబుతారని తెలిపారు. బండి సంజరు గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతూ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఓడిపోతుందనే భయం పట్టుకొని వామపక్షాలపై అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టే బీజేపీ అవుతుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా ఉండి మునుగోడులో బీజేపీకి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలని సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓట్లు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, రమణ, నాయకులు దామోదర్‌రెడ్డి, గంగదేవి సైదులు, బండారు నర్సింహా, అశోక్, సుదర్శన్, పల్లె శేఖర్‌రెడ్డి, గోశిక కరుణాకర్ ఉన్నారు.