Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవస్థలు పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు
- పట్టించుకోని అధికారులు, పాలకులు
నవతెలంగాణ-వేములపల్లి
అధికారులు, పాలకులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. అర్థ దశాబ్దం దాటిన పనులు పూర్తి కాకపోవడంతో రహదారి అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి. ఎంతోమంది అమాయక ప్రజలు గాయాల పాలవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వివరాలకు వెళితే మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాలను కలుపుతూ మిర్యాలగూడ నుండి సూర్యాపేటకు భీమవరం మీదుగా రహదారి విస్తరణ పనులు ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. ఒక మంత్రి, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమైనప్పటికీ రహదారి పనులు పూర్తి కాలేదు. 29 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు అంచనాలు మారుస్తూ రోడ్డు నిర్మాణ వ్యయం సుమారు 50 కోట్లకు చేరుకుంది. కాంట్రాక్టర్లు మారిన కలెక్టర్లు మారిన రహదారి రూపురేఖలు మాత్రం మారడం లేదు. రహదారి పలు జిల్లాలకు దగ్గర దారి కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. శెట్టిపాలెం నుండి భీమవరం వరకు అక్కడక్కడ పనులు చేయకుండా కంకర పరిచి వదిలేశారు. కల్వర్టులు నిర్మించడంలో జాప్యం చేస్తున్నారు. శెట్టిపాలెం సమీపంలో కల్వర్టు పనులు ప్రారంభించి సంవత్సరం దాటుతున్న పూర్తి కాలేదు. గోదాము వద్ద కల్వర్టు నిర్మాణం కోసం తవ్వి వదిలేయడంతో ప్రమాదకరంగా ఉంది. శెట్టి పాలెం, గోదాం రావులపెంట, లక్ష్మీదేవిగూడెం, ఆమనగల్ గ్రామాల వద్ద కంకర పోసి వదిలేశారు. లక్ష్మీదేవి గూడెం గ్రామం వద్ద నేటి వరకు బైపాస్ నిర్మణ పనులు ప్రారంభించలేదు. నిత్యం వాహన చోదకులు అసంపూర్తి రోడ్డు పనుల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నోమార్లు రోడ్డు పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా పనులను వేగవంతం చేసి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పనులు పూర్తికాకముందే దెబ్బతిన్న రహదారి
ఒక పక్కరహదారి పనులు కొనసాగుతుండగా సంవత్సరం క్రితం నిర్మించిన రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడుతున్నాయి. నాణ్యత లోపం వల్ల రోడ్డు మూడున్నరేళ్లకే దెబ్బతిన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వలన రోడ్డు గుంతలు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. చేపడుతున్న పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్మ పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు అరచేతులో పెట్టుకుని ప్రయాణిస్తున్నాం..అశోక్ రెడ్డి(మిర్యాలగూడ మండలం, పచ్చరగడ్డ గ్రామం)
రోడ్డు పనులు అసంపూర్తిగా చేసి వదిలేయడం వల్ల ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. ఆరు సంవత్సరాలుగా రహదారి బాగో లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నాం. రాత్రివేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు బాగో లేకపోవడం వల్ల బస్సులు సమయానికి రావడం లేదు. విద్యార్థులు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలి.