Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఈనెల చివరిలోగా ఆయిల్ పామ్ సాగు రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ , ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ, అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. వచ్చే జనవరి నుండి ప్రారంభించే ఆయిల్ పామ్ సాగు కార్యాచరణకు జిల్లాలో మొత్తం 5800 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 769 మంది రైతుల ద్వారా 3861 ఎకరాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తం 6500 ఎకరాలకు ఈ నెల చివరి లోగా లబ్దిదారులను గుర్తించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు కోసం అందించే సబ్సిడీలను వివరించాలని, రూ.193 విలువ గల ఆయిల్ఫామ్ మొక్కను సబ్సిడీపై రైతుకు రూ.20 అందిస్తున్నట్టు తెలిపారు. తోటల నిర్వహణకు మొదటి నాలుగేండ్లకు హెక్టారుకు రూ.5250 సంవత్సరానికి రాయితీ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంతర పంటల సాగుకోసం మొదటి నాలుగేండ్లకు గాను హెక్టారుకు రూ.5250 రూపాయల చొప్పున సంవత్సరానికి రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి 80 శాతం నుంది 100 శాతం వరకు రాయితీ అందించబడుతుందనే విషయాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో ఆయిల్ పామ్ అధికంగా సాగు అవుతున్నదని, అక్కడి రైతులతో ఫోన్ల ద్వారా ఇక్కడి రైతులతో మాట్లాడించేందుకు, సాగుకు ప్రోత్సహించేందుకు వ్యయసాయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ. టి.ఎస్ అయిల్ ఫెడ్ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
టీడీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి
ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యాధుల నుండి రక్షణ పొందుటకు టీడీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 7 నుండి 19 వరకు జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 789 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఐదవ, పదవ తరగతి చదువుతున్న (10, 16 ఏండ్ల వయస్సు గల) 19,544 మంది పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యాధుల నివారణకు టీడీ (టెటనస్ డిప్తీరియా) వ్యాక్సినేషన్ వేయనున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు ముందుకు వచ్చి తప్పనిసరి తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించేలా కార్యాచరణ చేపట్టాలని, గ్రామ స్థాయిలో ఆశ, ఏఎన్ఎంల సహకారంతో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఐదవ, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారందరూ వాక్సినేషన్ పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ కె. మల్లికార్జునరావు, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా ఏరియా ఆసుపత్రి డాక్టర్ చిన్నా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, డిప్యూటీ డీఎం హెచ్ఓ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ పరిపూర్ణ చారి, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ వినోద్ పాల్గొన్నారు.