Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలి
- కొనుగోళ్లలో జరుగుతున్న లోటుపాట్లను పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ యుద్ధప్రతిపాదికన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయా లని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జనరెడ్డి డిమాండ్ చేశారు.గురువారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డిభవన్లో నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కోతలు ప్రారంభమై సుమారు 30 రోజులవుతున్నప్పటికీ ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.అనేక గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభం చేయకపోవడం మూలంగా కల్లాలలో వరిధాన్యం పోసుకొని రైతులు కాంటాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.తుపాన్ వస్తే రైతులు పండించిన వరిధాన్యం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అకాలవర్షాల మూలంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలలో వేలాది ఎకరాలలో వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు.అకాలవర్షాల వల్ల నష్టపోయిన వరిపంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఐకేపీకేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే లిఫ్టు చేసి త్వరగా రైతులకు బిల్లులు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.గన్నీ బ్యాగులకొరతను,లారీల కొరతను నివారించి రైతులకు నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.గ్రామీణప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలికసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు డిసెంబర్ నెలలో కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లిసైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి, కల్లుగీత కార్మికసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్గూరి గోవింద్,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పులవెంకన్న, పట్నం జిల్లా కార్యదర్శి జిల్లాపల్లి నర్సింహారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి చెరుకు ఏకలక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెలజ్యోతి,జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, జిల్లా కార్యాలయ కార్యదర్శి చిన్నపంగి నర్సయ్య పాల్గొన్నారు.