Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం తథ్యం..
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ సరళిని బట్టి బీజేపీ అభ్యర్థి గోరంగా పరాజయం చెందుతారని, ఉభయ కమ్యూనిస్టులు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధిస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. అక్కడక్కడ బీజేపీ అభ్యర్థియే ఘర్షణలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పనులన్నీ గతంలో బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో ప్రయోగించిందని గుర్తు చేశారు. బీజేపీ కుటిల నీతిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగా రాజగోపాల్ రెడ్డిని ఒక పావుగా ఉపయోగించుకుని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, ఉప ఎన్నిక ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బలపడటానికి, తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు మునుగోడు నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకోని రాజగోపాల్ రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టుల పనులు కట్టబెట్టి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఉపఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు. రాజగోపాలరెడ్డిని అనైతికంగా బీజేపీలో చేర్చుకుని ఆ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబెట్టి అక్రమ పద్ధతుల్లో, అడ్డ దారుల్లో ధనబలాన్ని, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి కొన్ని అల్లర్లు సృష్టించి గెలవడం కోసం సర్వ శక్తులు ఉపయోగించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యయుతంగా వాస్తవాలు తెలుసుకొని సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ముందుకు వచ్చారన్నారు. ప్రజలు ధర్మం వైపు నిలబడతారని, బీజేపీని ఓడించి టీఆర్ఎస్కు ఘన విజయం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.