Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుచోట్ల బీజేపీ, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ
- చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఉప పోలింగ్
- చిన్నకొండూరు, కొంపల్లి, దేవత్‌పల్లి, రేఖ్యతండాలో మోరాయించిన ఈవీఎంలు
- మర్రిగూడలో పోలీసులు లాఠీచార్జి
- ఓటింగ్‌ను బహిష్కరించిన రంగం తండావాసులు
- పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, నల్లగొండ ఎస్పీ, అదనపు కలెక్టర్
- 6న కౌంటింగ్
నవతెలంగాణ-నల్లగొండ
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ), కూసుకుంట్ల ప్రభాకర్రెెడ్డి (టీఆర్ఎస్), పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మధ్యాహ్నానికే 43శాతం దాటిన పోలింగ్ ..
నియోజకవర్గంలోని మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, నారాయణపురం, చండూర్, గట్టుప్పల్, చౌటుప్పల్ మండలాలలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. చండూరు, నాంపల్లి మునుగోడు మండలాలలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 43 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు.
మోరాయించిన ఈవీఎంలు..
చౌటుప్పల్ మండలం పెదకొండూరు, మునుగోడు మండలం కొంపల్లి, నాంపల్లి మండలంలోని దేవతుపల్లి, రేఖ్య తండా గ్రామంలో ఈవీఎంలు మోరాయించాయి. ఆ గ్రామాల్లో ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు క్యూలైన్లో నిల్చుండిపోయారు.
మర్రిగూడలో లాఠీచార్జి.
స్థానికేతర్లు గ్రామాలలో కొచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. మర్రిగూడ మండలంలోని అంతంపేట గ్రామంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి డబ్బులు ఇవ్వలేదని, డబ్బులిచ్చిన తర్వాతే ఓట్లు వేస్తామని నిరసన వ్యక్తం చేశారు.
ఓటింగ్‌ను బహిష్కరించిన రంగం తండావాసులు
చౌటుప్పల్ మండలం రంగం తండా వాసులు ఓటింగ్‌ను బహిష్కరించారు. మొత్తం 350 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామాన్ని పంచాయితీగా మార్చి రోడ్లు వెయ్యాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా నేతలు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటేస్తామని రంగం తండా వాసుల డిమాండ్ చేశారు.
భారీ బందోబస్తు..
నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 15 కంపెనీలు కేంద్ర బలగాలు, 3,366 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు మండలంలోని పలివెలలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
ఎగ్జిట్ పోల్ సర్వేలు..
దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.
చౌటుప్పల్‌లో పోలింగ్ ప్రశాంతం
చౌటుప్పల్:మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక గురువారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చౌటుప్పల్‌తోపాటు తంగడపల్లి, లింగోజిగూడెం, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం, లక్కారంలోని మొత్తం 20 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చౌటుప్పల్‌లోని పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల పరిశీలకులు పంకజ్‌కుమార్ సందర్శించి, ఓటింగ్ సరళి పరిశీలించి, సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి తక్కువ సంఖ్యలో వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా వచ్చారు. చంటి పిల్లలతో వచ్చి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత చివరి రెండు గంటల్లో భారీగా పోలింగ్ నమోదైంది. యువత, మహిళలు ఓటు వేసేందుకు భారీగా క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 59,433 ఓట్లకుగాను 5 గంటల వరకు 47,496 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.91శాతం పోలింగ్ నమోదైంది.
కొంపల్లిలో మొరాయించిన ఈవీఎం
మునుగోడు:మునుగోడు నియోజకవర్గ ఏర్పడిన నాటి నుండి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 13వ సారి జరిగిన ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు మునుగోడు వైపే అన్న చందంగా మారింది. మునుగోడులో పోలింగ్ గురువారం ప్రశాంతంగా సాగింది. మునుగోడు మండల వ్యాప్తంగా 35వేల 786 ఓట్లు ఉండగా అందులో పురుషుల ఓట్లు 18,042, స్త్రీల ఓట్లు 17 ,737, ఒక్క ట్రాంజెండర్ ఉన్నారు. మండల వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా కొనసాగించారు. మండల వ్యాప్తంగా పోలింగ్ ఉదయం7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జరిగింది. పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్‌ను నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మునుగోడుతో పాటు వివిధ గ్రామాలలో ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలి రావడంతో గంటల తరబడి నిలబడి ఓటర్లు ఓట్లను వేశారు. కొంపెల్లి గ్రామంలో మాత్రం ఈవీఎంలు మురాయించడంతో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ ఉదయం 10 గంటల వరకు ప్రారంభం కాకపోవడంతో 6 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన 300 మందికి టోకెన్లు ఇచ్చి రాత్రి వరకు పోలింగ్‌ను కొనసాగించారు. ఉదయం 9 గంటల సమయంలో 11 శాతం ఓట్లు నమోదు కాగా 11 గంటల సమయం వరకు 24 శాతం , 1 గంట వరకు 34 శాతం, 3 గంటల వరకు--- శాతం, ఐదు గంటల వరకు 78 శాతం ఓట్లు నమోదయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంను ఐజి కమలహాసన్, ఎస్పీ రేమా రామేశ్వరి, అడిషనల్ కలెక్టర్, తాసిల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో పరిశీలించారు.
ఉద్రిక్తతల మధ్య పోలింగ్
చండూర్:మునుగోడు ఉపఎన్నిక గురువారం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. రెండు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణా, తోపులాటలు జరిగాయి. కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు. లాటిచార్జి జరిగే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల తోపులాటలో ఎలక్ట్రాన్ మీడియాపై చేయి చేసుకుని నెట్టేయడంతో వెంటనే మీడియా అప్రమత్తమై పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మీడియాను అదుపులోకి తీసుకొని గొడవను చెల్లాచెదురు చేశారు. అంతకు ముందు స్థానిక చౌరస్తాలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తరవడంతో పరిగెత్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ఆమె ఓటు హక్కును ఇడికుడలో వినియోగించుకున్నారు.
మొదట మందకోడిగా ఓటింగ్..
మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఉదయం నుండి మందకోడిగా ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం నుండి క్రమక్రమంగా ఊపు అందుకుంది. దీంతో ఓటర్లు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు లైన్లో నిలబడలేక కొందరు కూర్చుండిపోయారు. దీంతో ఇబ్బంది తప్పలేదు. తొమ్మిది గంటల దాకా ఓటింగ్ కొనసాగింది. మున్సిపల్ పట్టణంలో రెండు చోట్ల స్థానిక జెడ్పీహెచ్ ఎస్ హై స్కూల్, మార్కెట్ యార్డులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక వార్డుకు ఒకే ఈవీఎం పెట్టడంతో ఓటర్లు లైన్లో నిలబడలేక నానా ఇబ్బందులు పడ్డారు. మరి కొంత మంది ఓటర్లు లైన్లో నిలబడలేక, జ్వరంతో వచ్చిన వారు పోలీసులకు చెప్పిన లోనికి పంపియలేదు. దీంతో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక వెనుకకు తిరిగి పోయారు. ఎస్పీ రేమా రాజేశ్వరి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను, జరిగిన ఘర్షణ, తోపులాటను సమీక్షించారు.
వృద్ధులకు ఉచిత ఆటో సర్వీస్
80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల అధికారి ఉచితంగా ఆటో సర్వీసును నియమించారు. తమ ఇండ్ల దగ్గర నుండి పోలింగ్ కేంద్రాలకు ఆటో డ్రైవర్ పోలింగ్ కేంద్రాలకు తరలించి తిరిగి మళ్ళీ ఇండ్లకు జాగ్రత్తగా చేర్చారు.
ఎంట్రెన్స్‌లో ఉన్న గేట్లు గ్రిల్స్‌పై పట్టా
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక హై స్కూల్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ బూత్‌లో ఎంట్రెన్స్‌లో ఉన్న గేట్లు గ్రిల్స్‌పై ఓటర్లు నడవడం ఇబ్బందింగా మారింది. ఈ విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకులు, మున్సిపాలిటీ అధ్యక్షుడు భూతరాజు దశరథ ఆధ్వర్యంలో రచయిత నాగిళ్ళ శంకర్, చిట్టిమల్ల రవికుమార్, కారింగు గణేష్ దానిపై పట్టా వేసి ఓటర్లకు ఇబ్బంది లేకుండా చేశారు.
నాంపల్లి మండలంలో ప్రశాంతంగా పోలింగ్
నాంపల్లి:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో గురువారం ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మండలంలో మొత్తం 32 గ్రామపంచాయతీలలో 33,819 మంది ఓటర్లు ఉండగా 43 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం మాక్ పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో అధికారులు వెంటనే వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేసి సరైన సమయానికి పోలింగ్ మొదలు పెట్టారు. దేవత్‌పల్లి, రేఖ్యతండా పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల బ్యాటరీ పని చేయకపోవడంతో 20 నిమిషాల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కావలసిన వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులతో కలిసి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండలంలో పలు పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న పోలింగ్ సరలిని పరిశీలించారు. ఈ ఉపఎన్నికలో మండల వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏలు, వీఆర్ఏలు, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, పోలింగ్ సిబ్బందితో పాటు విధులు నిర్వర్తించారు.
స్వల్ప ఘర్షణలు మినహా.. చౌటుప్పల్ లో
ఎన్నికలు ప్రశాంతం
చౌటుప్పల్ రూరల్:మునుగోడు ఉప ఎన్నికలు చౌటుప్పల్ మండల వ్యాప్తంగా స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలో 68 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు సజావుగా సాగాయి. మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడ ఓటింగ్ ప్రక్రియ 10 నిమిషాలు ఆగిపోయింది. సమస్య పరిష్కారం అవడంతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పెద్ద కొండూరు గ్రామంలో బిజెపి కార్యకర్తలను పోలింగ్ బూత్ లోకి విచ్చలవిడిగా అనుమతిస్తున్నారని ఆరోపిస్తూ టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పంతంగి గ్రామంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు గ్రామంలోని తిష్ట వేసి ప్రచారం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి నాయకులు వారిపై దాడి చేశారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆరెగూడెం గ్రామంలో ఎన్నికల సర్వే ముసుగులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేస్తుండగా టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అరెస్టు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంకిరెడ్డి గూడెం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా రూ. 50వేల నగదును పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. నాలుగైదు గ్రామాల్లో చెదురుమదురు ఘటనల్లో జరిగాయి. పోలీసుల జోక్యంతో రాజకీయ పార్టీల కార్యకర్తల గొడవలు సద్దుమణిగాయి. ఓట్లు వేయడానికి ఓటర్లు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మందకోడిగా వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఓట్లు వేయడానికి ఓటర్లు తాకిడి పోలింగ్ కేంద్రాలకు తగిలింది. తుప్రాన్ పేట గ్రామంలో సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్లు భారీగా కదిలారు.
- పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి
మండలంలో పోలింగ్ కొనసాగుతున్న ప్రక్రియను నల్లగొండ జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి పరిశీలించారు. మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలోని పోలింగ్ బూతులను సందర్శించారు.
- పర్యటించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ మండలంలోని గ్రామాల్లో కొనసాగిన ఎన్నికల ప్రక్రియను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.