Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేపల మార్కెట్ నిర్మాణం పేరుతో నిధులు డ్రా
- రూ.2 లక్షల అంచనా వ్యయంతో పనులు
- రెండు విడతల్లో రూ. లక్షా 27231 ఎస్ఎఫ్ సీ నిధులు డ్రా
నవ తెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీలో చేపల మార్కెట్ ఉందంట. అవును నిజం..మీరు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే చేపల మార్కెట్ నిర్మించినట్టు ఎస్ఎఫ్ సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) నిధులు డ్రా చేశారు మరి. మున్సిపాలిటీలోని పెద్ద చెరువు కట్ట ప్రాంతంలో చేపల మార్కెట్ నిర్మించినట్టు రెండు విడతల్లో ఈ నిధులు డ్రా చేశారు. పెద్ద చెరువు కట్ట చౌరస్తాలో మెయిన్ రోడ్డు పక్కన ఒకరిద్దరు వ్యక్తులు వారంలో రెండు, మూడు రోజులు వచ్చి చేపలు అమ్ముకుని వెళుతుంటారు తప్ప అక్కడ ప్రత్యేకంగా చేపల మార్కెట్ అనేదే లేదు. వివరాల్లోకి వెళితే... మున్సిపాలిటీలోని పెద్ద చెరువు కట్ట వద్ద చేపల మార్కెట్ నిర్మించాల్సి ఉందని 2020 సెప్టెంబర్ 4న వార్డు ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్‌కు లెటర్ రాశారు. మరో మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ 7న చేపల మార్కెట్ నిర్మాణం మొదటి భీం పిల్లర్ లెవల్ మొరం నింపడానికి మరో లెటర్ రాశారు. మున్సిపాలిటీ ఎస్ఎఫ్ సీ నిధుల ద్వారా చేపల మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. 2020 సెప్టెంబర్ 9న మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 243 ద్వారా చేపల మార్కెట్ (బేస్ మెంట్ లెవల్) నిర్మాణం కోసం రూ.లక్ష అంచనా వ్యయంతో ఒక పని, తీర్మానం నంబర్ 244 ద్వారా చేపల మార్కెట్ నిర్మాణం మొదటి భీం పిల్లర్ లెవల్ మొరం నింపడానికి రూ.లక్ష అంచనా వ్యయంతో మరో పనిని నామినేషన్ పద్ధతిన కె.శ్రీనివాస్ గౌడ్ కు 2020 సెప్టెంబర్ 15న కేటాయించారు.
రెండు విడతల్లో రూ.ఒక లక్షా 27231 నిధులు డ్రా..
పెద్ద చెరువు కట్ట వద్ద చేపల చెరువు నిర్మాణం చేసినట్టు రెండు విడతల్లో కె.శ్రీనివాస్ గౌడ్ పేరున మున్సిపాలిటీ అధికారులు నిధులు విడుదల చేశారు. ఎన్ఎఫ్ సీ నిధుల నుంచి రూ.2 లక్షల అంచనా వ్యయంతో చేపల మార్కెట్ బేస్ మెంట్ లెవల్ నిర్మాణం, పిల్లర్ భీం లెవల్లో మొరం పోసే పనులు చేశారు. చేపల మార్కెట్ బేస్ మెంట్ లెవల్లో నిర్మాణం చేసినందుకు గాను 2020 నవంబర్ 11న జీఎస్టీ, ఐటీ ఇతరత్రా రూ.14600 పోను రూ.85,400 (చెక్ నంబర్ 2621895, ఎంబీ రికార్డ్ నంబర్ ఎంసీఎం/15/2020, 2021 పేజీ నంబర్ 17 నుంచి 25) చెక్ జారీ చేశారు. బేస్ మెంట్ పిల్లర్ లెవల్ మొరం పోసినందుకు 2020 డిసెంబర్ 4న జీఎస్టీ, ఐటీ ఇతరత్రా రూ.6311 పోగా రూ.41,831 (చెక్ నంబర్ 3543665, ఎంబీ రికార్డ్ నంబర్ ఎంసీఎం/15/2020, 2021 పేజీ నంబర్ 26) మరో చెక్ జారీ చేశారు. మొదట మోడ్రన్ పబ్లిక్ టారు లెట్ నిర్మాణం కోసం చెరువు కట్ట వద్ద నిర్మాణం ప్రారంభించగా ప్రభుత్వం రెడీమేడ్ పబ్లిక్ టారు లెట్ నిర్మించాలని ఆదేశించడంతో దానినే ఫిష్ మార్కెట్ గా చూపించి బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ పనులు చేసిన కె.శ్రీనివాస్ గౌడ్ ఎవరన్నది తెలియడం లేదు. పనులను అతనే చేశాడా లేక ఆ పేరుతో మరెవరైనా నిధులు డ్రా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలోని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం నిధులు ఖర్చు చేయకుండా ఇలాంటి వృథా పనులకు నిధులు ఖర్చు చేయడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్ ను వివరణ కోరగా మున్సిపాలిటీలో చేపల మార్కెట్ అనేదే లేదు. అప్పుడు నిధులు ఎలా డ్రా చేశారన్నది నాకు తెలియదు.