Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీదే గెలుపంటున్న ఎగ్జిట్ పోల్స్
- టీఆర్ఎస్కు 40శాతానికి పైగా ఓట్లు
- 10వేల మెజారిటీ వస్తుందనే అంచనాలు
- 2వ స్థానంలో బీజేపీ.. తర్వాత కాంగ్రెస్
- ఉపఎన్నిక ఫలితాన్ని తేల్చిన సర్వే సంస్థలు
నవతెలంగాణ-నల్లగొండ
రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ గురువారం ముగియగానే వివిధ ఏజెన్సీలు నిర్వహించిన 'ఎగ్జిట్ పోల్స్' వెల్లడయ్యాయి. ఒకటి, రెండు మినహా అన్ని సర్వే సంస్థలు కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకే మునుగోడు ఓటర్లు పట్టం కట్టినట్లు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. ఉపఎన్నికలో కారు వాయు వేగంతో దూసుకెళ్లినట్టు స్పష్టమవుతోంది. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో వికసించిన బీజేపీకి మునుగోడులో బ్రేక్‌పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేక్రమంలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటంతోపాటు కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అవుతున్నట్టు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. మునుగోడులో అత్యధికంగా 48-51 శాతం ఓట్లను టీఆర్ఎస్ సాధిస్తుందని 'థర్డ్ విజన్ రీసెర్చ్' వెల్లడించింది. త్రిశూల్ సంస్థ టీఆర్ఎస్కు 47శాతం ఓట్లు వస్తాయని ప్రకటించింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, ఎస్ఏఎస్ గ్రూపు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదికలు కూడా 41 నుంచి 42 శాతం ఓట్లను టీఆర్ఎస్ సాధిస్తుందని తెలిపాయి. కౌటిల్య పోల్స్ 39.26 శాతం (40 శాతానికి దగ్గరగా) ఉండగా..రీసెర్చ్ ఎఫెక్స్, సీమ్యాక్లు మాత్రం టీఆర్ఎస్కు వచ్చే ఓట్ల శాతాన్ని కాస్త తక్కువగా చూపాయి. బీజేపీకి 44.62శాతం ఓట్లు వస్తాయని, టీఆర్ఎస్కు 39.26 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని కౌటిల్య సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్కు బీజేపీకి ఓట్ల శాతంలో తేడా కనిష్ఠంగా 7, గరిష్ఠంగా 15శాతం ఉండటం గమనార్హం. టీఆర్ఎస్కు మెజారిటీ కూడా 10 వేలకు పైనే వస్తుందని, 15-20 వేలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఒక కౌటిల్య సంస్థ సర్వేలో మినహా.. అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీకి రెండో స్థానాన్ని కట్టబెట్టాయి. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయినట్లు ఏజెన్సీలు వెల్లడించాయి. సీ- మ్యాక్ నిర్వహించిన సర్వేలో 30-34 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానం ఇచ్చారు. ఇది మినహా మిగిలిన అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమని తేల్చాయి. అయితే మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావటం గమనార్హం. ఈ ఎన్నికలో ఓడిపోతే కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఒక స్థానం తగ్గినట్లు అవుతుంది.
బీఎస్పీకి 4శాతం ఓట్లు..
అనూహ్యంగా బీఎస్పీకి కూడా ఓట్లు ఎక్కువగానే పడినట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. కొన్ని ఏజెన్సీలు 5 నుంచి 10శాతం, మరికొన్ని ఏజెన్సీలు 1 నుంచి 4 శాతం వరకు బీఎస్పీకి ఓట్లు పడినట్లు తెలిపాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్‌కు అనూహ్యంగా ఒక శాతం ఓట్లు వచ్చినట్లు పలు సర్వే సంస్థలు ప్రకటించాయి.