Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుట్రను తిప్పి కొట్టండి
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ - భువనగిరి
అనేక పోరాటాల ఫలితంగా పేదలు, వ్యవసాయ కూలీలు సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వము ఎత్తివేయాలనే కుట్రలు చేస్తుందని ఈ కుట్రలను ఉపాధికూలీలు తిప్పి కొట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం రావడానికి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. ఆ పోరాటాలకు మద్దతుగా ఆనాడు వామపక్ష పార్టీలు పార్లమెంటులో పోరాటం చేసి చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించించాయన్నారు. ఉపాధిహామీ చట్టం వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఆర్థికంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి, విద్య వైద్యంలో కొంత మార్పు రావడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే అనేక మార్పులు తెచ్చి, ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తుందని విమర్శించారు. చట్ట పరిరక్షణ కోసం సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈనెల 15న రవీంద్రభారతిలో గ్రామీణ ఉపాధి చట్టం అమలు - సవాళ్లు అనే అంశంపై రాష్ట్రస్థాయిలో సెమినార్ నిర్వహించనున్నట్టు చెప్పారు. కూలీలు ఎనిమిది గంటలు పనిచేయాలని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు కనీస వేతనం రూ.600 ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, మెటీరియల్ పేమెంట్ ను పెంచి కూలీలను తగ్గిస్తు దానిని విరమించుకోవాలని, సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , కేరళ రాష్ట్ర గ్రామీణ అభివద్ధి, లోకల్ బాడీస్ శాఖ మంత్రివర్యులు ఎంబి రాజేష్ , అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ , వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని తెలిపారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ ఈనెల 7 తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ మండల మహాసభలు, ఈనెల 26 , 27 తేదీలలో మోత్కూరు పట్టణంలో జిల్లా రెండవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల్ల పెంటయ్య జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, వల్లంబట్ల శ్రీనివాస్ రావు, మెతుకు అంజయ్య, దొడ్డి బిక్షపతి, గడ్డం సుదర్శన్, బోయ యాదయ్య, ఎర్ర ఊషయ్య, బొడ్డు కిషన్, ప్రసాదం విష్ణు, కోట కృష్ణ, మామిడి సురేష్ పాల్గొన్నారు.