Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూసుకుంట్ల గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ వశం కానున్న శాసనసభా స్థానాలు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో నేడు నేతల భవితవ్యం తేలనుంది. నల్లగొండ లోని స్ట్రాంగ్ రూమ్‌లో గట్టి బందోబస్తు మధ్య అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల చరిత్రలో మునుగోడు ఉప ఎన్నిక రికార్డు సృష్టించనుంది. సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ కైవసం కానున్నాయి . మునుగోడు ఉప ఎన్నికలో 93శాతం భారీగా పోలింగ్ జరిగింది. మొదట మందకొడిగా ప్రారంభమైనప్పటికీ రాత్రి వరకు పోలింగ్ కొనసాగడం విశేషం .సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వ్యయప్రయాసాలకోర్చి మరి వినియోగించారు. ఉప ఎన్నిక లో టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , కాంగ్రెస్ పాల్వాయి స్రవంతి ,స్వతంత్ర అభ్యర్థి కేఏ.పాల్, ఇతర అభ్యర్ధులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు . జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీలు ఖర్చుకు వెనకాడలేదు. పోలీసుల తనిఖీల్లో నగదు బంగారం సైతం పట్టుబడిన సంగతి పాఠకులకు విదితమే.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో ఒక సాధారణ ఎన్నికలకు మరో సాధారణ ఎన్నికలకు మధ్య ఏకంగా మూడు ఉప ఎన్నికలు వచ్చినా సందర్భం లేదు .2018లో డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొత్తం అయిదు ఉపఎన్నికలు రాగా అందులో మూడు జిల్లాకు చెందిన కావడమే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులకు చర్చానీయాంశంగా మారింది.ఉమ్మడి నల్లగొండ జిల్లా లో మూడు ఉపఎన్నికలు రాగా 2019లో హుజూర్ నగర్ ఉపఎన్నిక జరిగింది .హుజూర్నగర్
ఎమ్మెల్యేగా కొనసాగిన ఉత్తమ్ ,పార్లమెంటు స్థానం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ ఉపఎన్నిక జరిగినా జిల్లాలో టీిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది . టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై భారీ మెజార్టీతో గెలుపొందారు . కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గతేడాది మేలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగింది. సాగర్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య కొనసాగుతూ 2020 డిసెంబర్లో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నోముల నర్సింహయ్య కుమారుడు నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పై పోటీ చేసి ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారు .అక్కడ టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ లో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది . సీపీఐ(ఎం), సీపీఐ బలంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ి వామపక్షాలు పార్టీలు పెద్ద దిక్కుగా మారాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోరుతూ బలంగా ఆ పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ గెలుపుకు బాటలు వేశారు . పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ కే విజయం దక్కుతుందని హ్యాట్రిక్ విజయం తథ్యమని పలువురు విశ్లేషకులు సంస్థలు ఢంకా భజాయిస్తున్నాయి .ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలో ఒక అరుదైన సందర్భం ఆవిష్కృతం కానుంది.