Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు
నవతెలంగాణ -సూర్యాపేటరూరల్
వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట పరిధిలోని 12వ వార్డు పిల్లలమర్రిలో జరిగిన ఆ సంఘం మండల ఐదవ మహాసభలో ఆయన మాట్లాడారు.సమాజానికి ఆహారం అందిస్తూ, నిత్యం అష్ట కష్టాలు పడుతున్న వ్యవసాయ కార్మికుల గోడును పట్టించుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు దేశంలో 60 శాతం ఉన్నారని, వారి సంక్షేమాన్ని పాలకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా కూలీగా పనిచేసిన వ్యవసాయ కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చి నెలకు 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని కోరారు. భూమిలేని వ్యవసాయ కూలీకి కూలి బంధు పథకం ప్రవేశపెట్టి లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సమస్యల పరిష్కారం కోసం మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జెండాను ఆ సంఘం సీనియర్ నాయకులు పురుగుజ్జ వెంకటయ్య ఆవిష్కరించారు .అనంతరం మూడు సంవత్సరాలుగా తిరుమలగిరి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకలాపాల సమీక్ష నివేదికను వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పడమటింటి నగేష్ ప్రవేశపెట్టారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా పారిజాత ,మండల ప్రధాన కార్యదర్శిగా నోముల ధనమూర్తి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు మారం చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నల్ల మేకల అంజయ్య ,మండల నాయకులు పొదిల అంజయ్య ,తీగల లింగయ్య ,సావిత్ర ,చారి తదితరులు పాల్గొన్నారు.