Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండా ముంచిన నకిలీ పత్తివిత్తనాలు
- నష్టపోతున్న రైతులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
నాసిరకం పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.తక్కువ ధరకు మంచి విత్తనాలు దొరుకుతాయని పక్కవాళ్ల మాటలు విన్న రైతులకు నిరాశే మిగిలింది. పత్తి చేను ఏపుగా పెరిగినప్పటికీ కాత,పూత లేకపోవడంతో ఆ రైతులు ఎవ్వరికి చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతులు జక్కలి సైదులు,దాసరి సుధాకర్,పాలకుర్ల యాదమ్మ, పాలకూరల కాశయ్య, గుదేసత్తయ్య నల్లగొండ జిల్లా దామరచర్ల లోగల బాలాజీ విత్తనాల షాపులో బోల్గార్డ్ కంపెనీకి చెందిన బున్,సాహౌ, బీంలా రకాలకు చెందిన పత్తి విత్తనాలను ఒక్కొక్కటి రూ.670లు చెల్లించి 70 నుంచి 80 ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఈ విత్తనాలను లచ్చమ్మ గూడెం గ్రామంలో సుమారుగా 30 ఎకరాల్లో విత్తారు. రైతులకు ఇప్పటివరకు చేతికి పంట రాలేదు. చేను మాత్రం వేపుగా పెరిగింది. పలు దఫాలుగా పూత వచ్చి రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. పూత రాలిపోకుండా నిలిచి ఊడ పట్టేందుకు ఇప్పటికీ మూడు పర్యాయాలు మందులు పిచికారి చేశారు. పక్క పొలం రైతులు ఇప్పటికే పత్తి ఏరుతున్నప్పటికి తాము వేసిన పత్తి చెట్టుకు రెండు మూడు కాయలు తప్ప పూత కాతా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నాసిరకమైన పత్తి విత్తనాలను లచ్చమ్మ గూడెం గ్రామంలోని జక్కలి సైదులు 10 ఎకరాల్లో 30 ప్యాకెట్లు, దాసరి సుధాకర్ 9 ఎకరాల్లో 27 ప్యాకెట్లు, పాలకుర్ల యాదమ్మ 4 కరాల్లో 12 ప్యాకెట్లు, పాలకూరల కాశయ్య,గుదే సత్తయ్య రెండు ఎకరాల్లో ఆరు ప్యాకెట్లు చొప్పున విత్తినట్లు తెలిపారు.వాళ్లందరూ ఎకరానికి రూ.3500ల చొప్పున కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వేసిన పత్తి పూతకాత లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి వెళ్లే దిక్కు లేదను దిగాలు చెందుతున్నారు.కౌలు ఎట్ల తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మంచి విత్తనాలు అంటే నమ్మి మోసపోయినం: జక్కలి సైదులు కౌలు రైతు లచ్చమ్మ గూడెం
మంచి విత్తనాలు అంటే నమ్మి మోసపోయిన పది ఎకరాల భూమిని ఎకరానికి రూ.3500 చొప్పున కౌలుకు తీసుకున్న రూ. 20వేలు ఖర్చు పెట్టి 30 ప్యాకెట్ల విత్తనాలను పెట్టిన. పూత రాలుతుండడంతో మూడుసార్లు మందులు కొట్టిన ఇప్పటికే రెండు లక్షల పైగా ఖర్చుపెట్టిన. రూపాయి పెట్టుబడి రాలేదు. మంచి విత్తనాలని మోసపోయిన ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
కౌలు ఎట్ల తీర్చాలి
దాసరి సుధాకర్ లచ్చమ్మ గూడెం రైతు
తనకు ఉన్న నాలుగు ఎకరాలతో పాటు తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకున్నా 9 ఎకరాల్లో దామరచర్ల నుంచి తెచ్చిన విత్తనాలు పెట్టిన చేను పెరిగింది తప్ప కాత రాలేదు రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి కనబడుటలేదు. కౌలు ఎట్ల తీర్చాలి.పెట్టుబడులెట్లా కట్టాలి. మోసగించిన ఫెర్టిలైజర్ షాప్ పై చర్యలు తీసుకోవాలి.