Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ- నల్లగొండ
ఈనెల 15న రవీంద్రభారతి, హైదరాబాద్లో గ్రామీణ ఉపాధి చట్టం అమలు - సవాళ్లు అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర సెమినార్లో కార్మికులు, మెట్లు, ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ రకాల ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ పిలుపునిచ్చినారు. గురువారం ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ కు సంబంధించిన పోస్టర్ను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారిని కాలిందినితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సంవత్సరం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్నఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కొటీి 30 లక్షలకు పైగా కూలీలు ఉపాధి హామీలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించు కుంటున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి చట్టానికి నిధులు తగ్గిస్తూ రద్దు చేసే కుట్రలకు పాల్పడుతుందన్నారు. కొత్త జీవోలు తెచ్చి ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రెండుసార్లు కూలీలు పని ప్రదేశంలో ఫొటోలు దిగి అప్ లోడ్ చేయాలని, ఎండాకాలం 8 గంటలు పనిచేయాలని, పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా, పెండింగ్ వేతనాలు చెల్లించకుండా, మెటీరియల్ పేమెంట్ ను పెంచి కూలీలను తగ్గిస్తూ పని భారం పెంచి, పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతూ ఉపాధి హామీ పనులకు కూలీలు రావద్దు అనే కుట్రలను కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉందని విమర్శించారు. కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు వేతనం రూ.600 ఇవ్వాలని, మేట్లకు గుర్తింపు కార్డులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , కేరళ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, లోకల్ బాడీస్ శాఖ మంత్రి ఎంబి రాజేష్ , అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ , సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, సహాయ కార్యదర్శి మన్నెం బిక్షం, అంకెపాక సైదులు, నల్గొండ పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష యాదయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు అన్న భీమోజు పద్మ తదితరులు పాల్గొన్నారు.