Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పర్యటన పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - భువనగిరి
ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనేక హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేసేందుకు నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వివేరా హోటల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధికి సహకరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వాణిజ్యపరంగా 2021 లో ఉత్పత్తి ప్రారంభించిందన్నారు, ఇప్పటికే 10 లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా జరిగిపోయిందన్నారు. అంతేకాదు రూ .87 కోట్ల లాభం వచ్చిన ఫ్యాక్టరీని ఇప్పుడు మోడీ వచ్చి ప్రారంభించేది ఏంటి అని ప్రశ్నించారు. కేవలం బిజెపి మునుగోడులో గెలుస్తామని అంచనాలు వేసుకుని ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం అన్నారు .ప్రధాని మోడీ ఇప్పుడు ఎందుకు ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి పాత ఫ్యాక్టరీని మళ్లీ ఓపెన్ చేస్తున్నారని, దీనిని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుందన్నారు. కాషాయ మూకలకు ,మతోన్మాద ఎజెండకు తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదని మునుగోడు ప్రజల స్పష్టంగా తీర్పు ఇచ్చారన్నారు. దేశంలో ఇతర రాజకీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీి వేలకోట్ల రూపాయలతో కుట్ర పన్నుతున్నదన్నారు. అదే తరహాలో ఇప్పటివరకు 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిందని చెప్పారు. ఈ దుర్బుద్ధితోనే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని దాన్ని రాష్ట్ర పోలీసులు తిప్పికొట్టారని తెలిపారు .కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా ఎన్నో కుట్రలు చేసిందన్నారు. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న మోడీ గో బ్యాక్ 'అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటలు బాలరాజు, కల్లూరు మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు ,మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.