Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిండికేటైన మిల్లర్లు
- తుకాల్లో మోసం..తగ్గిస్తున్న ధర
- కొనుగోళ్లు నిలిపిన మిల్లర్లు
- నష్టపోతున్న అన్నదాతలు
అన్నదాతాల కష్టాలు మొదలయ్యాయి. పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వానాకాలం సీజన్ పంట చేతికి రావడంతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు మిల్లులకు తరలి వస్తున్నారు. ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువగా సన్నరకం ధాన్యం సాగు చేయగా ఆ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. పచ్చి ధాన్యం కొనుగోలు చేసి నేరుగా బాయిల్డ్ చేస్తున్నడంతో పంటను కోసిన వెంటనే ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆ ధాన్యానికి తేమ 28శాతం వరకు ఉన్నప్పటికీ మిల్లర్లకు గిట్టుబాటు అవుతుంది. కానీ 20 నుంచి 25శాతం తేమ ఉన్నప్పటికీ ధాన్యం నాణ్యత లేదని సాగుతూ ధర తగ్గిస్తూ అన్నదాతలను మోసం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో రూ.2300 ధర పలికిన ధాన్యం ఇప్పుడు రూ.2000 మించి ధర ఇవ్వడం లేదు. క్వింటాకు రూ.300 తగ్గిస్తున్నారు. పైగా తూకాల్లో మోసం చేస్తూ, తరుగు, హమాలీ, గుమస్తాల ఖర్చుల పేరిట కోతలు విధిస్తూ అన్నదాతలకు నట్టేట ముంచుతున్నారు. గురువారం వే బ్రిడ్జీలను తూనిక కొలతల అధికారులు తనిఖీకి రాగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. సాయంత్రం వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యం రాశులను ట్రాక్టర్లలో నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లులో వద్ద ఉన్న వే బ్రిడ్జి కాంటాలలో వ్యత్యాసం చూపడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారు. ఇది ట్రాక్టర్కు 5 నుంచి పది క్వింటాల వరకు తక్కువ చూపుతో మోసం చేస్తున్నారు. కంప్యూటర్లో సాంకేతిక సమస్యలను సష్టించి ఈ మోసాలకు తెరలేపారు. ప్రతి ట్రాక్టర్కు 10 నుంచి 20 కిలోల వరకు వ్యత్యాసం కనిపిస్తుంది. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పలు రైస్ మిల్లులో కాంటాల్లో తేడా ఉండడం గుర్తించి అధికారులు వే బ్రిడ్జీలను సీజ్ చేశారు. గురువారం తూనికల కొలతల అధికారులు మిర్యాలగూడ మండల యాదగిరి పల్లి గ్రామంలో ఉన్న నాలుగు రైస్ మిల్లుల్లో వే బ్రిడ్జీలను తనిఖీ చేశారు. ఆ సమయంలో మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెట్టారు. ఖమ్మంలోని ఉన్న కొత్త రైస్ మిల్ ప్రారంభించిన మొదటి రోజే మూసి వేయడం గమనార్హం. పైగా ప్రతి ట్రాక్టర్కూ 25 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. అంతేకాకుండా హమాలీ గుమస్తా చార్జీలు రైతుల పైనే వేస్తున్నారు. ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని నేరుగా బాయిల్డ్ లోకి దిగుమతి చేసినా చార్జీలను వసూలు చేస్తున్నారు.
సిండికేటైన మిల్లర్లు... తగ్గిన ధర
ఆయకట్టులో కోతలు జోరందుకోవడంతో మిల్లర్లు సిండికేట్గా మారారు. నాన్ ఆయకట్టు ధాన్యం వచ్చినప్పుడు క్వింటాకు రూ.2,300 వరకు ధర వేశారు. ఇప్పుడు ఆయకట్టు ధాన్యం వస్తుండడంతో సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నారు. అనుకున్నంత తేమ లేనప్పటికీ తేమ ఎక్కువగా ఉందని, తాలు అధికంగా ఉందని సాగులు చూసి, గింజ గట్టిగా లేదని సాకులు చెప్పి దర తగ్గిస్తున్నారు. మద్ద ధర 2150 ఉండగా నాణ్యత ఉన్న ధాన్యాన్ని కూడా రూ.2000 నుంచి ధర వేయడం లేదు. నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తెలిసినవారు కాస్త ప్రాధేయ పడితే తప్ప రూ.50 గగనంగా పెంచుతున్నారు. మరో వారం పది రోజుల్లో ఆయకట్టులో పెద్ద ఎత్తున కోతలు ఉండడంతో ధాన్యం రాశులు మిల్లులకు పెద్ద ఎత్తున రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ధర కంటే మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. చివరికి రూ.1600, 1700 ధర వేసే అవకాశం లేకపోలేదు.
అలాంటిదేమీ లేదు
గౌరు శ్రీనివాస్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు. తూకాల్లో ఎలాంటి మోసాలకు పాల్పడడం లేదు. ఎప్పుడైనా అధికారులు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ధాన్యం ఎక్కువగా రావడం వల్ల వచ్చిన ధాన్యంలో నాణ్యత లేకపోవడంతో ధర తగ్గించి వేస్తున్నాం. ఇప్పుడున్న ధాన్యానికి తాలు పేరిట క్విటాల్కు రూ.300 నష్టం వస్తున్నది. అందుకే రూ.2000 ధర వేస్తున్నాం. మిల్లర్లు సిండికేట్ అయ్యారనేది అవాస్తవం.