Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా
- ఐదు నెలల్లో పనులన్ని పూర్తి
- ఆదాయం గణనీయంగా పెరిగింది
- ఆన్లైన్లో అన్ని సమస్యలకు పరిష్కారం
- నిరంతరం నీటి సరఫరా నా కల..
- 'నవతెలంగాణ'తో మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మున్సిపాలిటీ అంటే చిన్న చూపు.. పనులు సరిగా చేయరు అనే భావన.. పన్నులు కట్టిన అధికారుల జేబుల్లోకి వెళతాయనే అనుమానం... పనుల కోసం కార్యాలయానికి వెళితే ఎంత ఇవ్వమంటారో అనే భయం. ఇది ఒకప్పటి నల్లగొండ మున్సిపాలిటీ పరిస్థితి. వాటిని పటాపంచలు చేసి నల్లగొండ పట్టణంలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి.రమణాచారిి. నల్లగొండ మున్సిపాలిటీ కమిషనర్ గా గత జనవరి 5 న బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పట్టణంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి సిబ్బందితో ఆ దిశగా అడుగులు వేయిస్తున్నారు. సరైన అధికారులు లేక ఇన్ని రోజులు కుంటుపడిన అభివృద్ధి సరైన అధికారి రావడంతో గాడిన పడింది. మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఇన్ని రోజులు తీసుకున్న విశ్రాంతికి పుల్ స్టాప్ పెట్టి పనుల్లో నిమగమయ్యారు. పనుల నిమిత్తం వార్డుల్లోకి పరుగులు పెడుతున్నారు. కొత్త కమిషనర్ పనితీరు నచ్చిన సిబ్బంది ఒకలాగా, పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది మరొక లాగా వ్యవహరిస్తున్నారు. ఆ గమ్య గోచరంగా... అస్తవ్యస్తంగా... అవినీతికి నిలయంగా మారిన మున్సిపల్ కార్యాలయం ఆయన వచ్చాకే గాడిన పడింది. నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మరో 5 నెలల్లో పూర్తి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నల్లగొండ మున్సిపాలిటీని నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్న నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి తో నవ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
జిల్లాకు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? అప్పటి పరిస్థితి ఎలా ఉంది?
అనుకోని పరిస్థితులలో జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నల్లగొండ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. మీరు రావాలి అని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న నేను సార్ మాట కాదనలేక తప్పనిసరి అయి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన కొత్తలో మున్సిపాలిటీ పనితీరు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అధికారులు, సిబ్బందికి జవాబుదారితనం లేదు. అందువల్ల ఇన్నాళ్లు అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇక్కడ ప్రజలు మాత్రం ఎంతో మంచివారు. వారితో అనుబంధం చాలా గొప్పది. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరిస్తున్నారు. అధికారులు సిబ్బంది తీరులో మార్పు వచ్చింది. వచ్చిన కొత్తలో ఎంతోమంది కార్యాలయం చుట్టూ తిరగడం చూశాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
మీరు వచ్చాక ఏం చేశారు?
మున్సిపాలిటీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అధికారులు, సిబ్బంది పనిచేయకపోవడం వల్ల ఆదాయానికి గండి పడింది. నల్లా బిల్లులు, లైసెన్స్ బిల్లులు, ఇంటి పన్నులు, షాపుల అద్దెలు, ఇలా అన్ని పేరుకుపోయాయి. 2011 నుండి చెల్లించని బిల్లులు నేటికీ ఒకటి రెండు ఉన్నాయి. నేను వచ్చాక మూడు నెలల్లోనే గత మార్చి నెల వరకు 10 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదనంగా తీసుకువచ్చాను. పెండింగ్లో ఉన్న మూడు నెలల సిబ్బంది జీతాలను ఇప్పించాము. 800 గ్రీవెన్స్ ఫిర్యాదులను పరిష్కరించాం. గతంలో మొత్తం ఆప్లైన్ ఉండేది. నేడు ఆన్లైన్్ చేశాము. ముటేషన్ లు వందల్లో పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాం.
రెవెన్యూ పరంగా నల్లగొండ పరిస్థితి?
పట్టణాభివృద్ధికి కావలసిన రెవెన్యూ ఇక్కడ ఉంది. కానీ వాటిని వసూలు చేయడంలో విఫలమయ్యారు. మున్సిపాలిటీ కి ప్రధానంగా కావలసింది ఆదాయమే అది గతంలో చాలా తక్కువగా ఉంది. గతంలో నలుగురు బిల్ కలెక్టర్లు మాత్రమే ఉండేది. అందువల్ల పన్నులు వసూలు చేయలేకపోయారు. ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచాము. నేడు 18 మంది బిల్ కలెక్టర్లు నలుగురు ఆర్ఐలు, ఇద్దరు ఆర్వో లను నియమించాం. 6 వేలకు పైన అసెస్మెంట్లను చేశాం. దీంతో వారికి లబ్ధి చేకూరింది. గతంలో 8.45 కోట్ల ఆదాయం ఉంటే నేడు 14.85 కోట్లకు చేరింది. నల్లా బిల్లుల విషయంలో 1.41 కోట్లు ఉండగా ప్రస్తుతం 2.7 కోట్లు వచ్చాయి. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు అంతకుముందు 16 లక్షలు ఉంటే నేడు 38 లక్షలకు చేరింది. భవన నిర్మాణ అనుమతి ఫీజులు 6.17 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 11.3 కోట్లు వచ్చాయి. షాపుల కిరాయిల వసూలు 18.72 లక్షలు ఉంటే ప్రస్తుతం 2.81 కోట్లు వసూలు చేశాం. ఇలా అన్నింటిలో ఆదాయాన్ని పెంచాం. ఈ ఆదాయం పట్టణాభివృద్ధికి ఎంత దోహదపడుతుంది.
అభివృద్ధి పనులు ఏమేమి చేస్తున్నారు?
నేను విధుల్లో చేరిన నాటికి 2018 లోనే 30.60 కోట్ల రూపాయల తో రోడ్డు నిర్మాణ పనులు మంజరై ప్రారంభమైన పనులు జీరో శాతం గానే ఉంది. ఎవరికి పట్టింపు లేదు. నల్లగొండ పట్టణంలో ప్రస్తుతం 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పనులన్నీ దాదాపు చివరి దశలో ఉన్నాయి. మొత్తం పనులు వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తవుతాయి.
రోడ్డు నిర్మాణ పనులను ఎక్కడెక్కడ చేస్తున్నారు?
రూ.30.60 కోట్లతో హైదరాబాద్ రోడ్డు లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 46 కోట్లతో స్వామి వివేకానంద జంక్షన్ నుండి పెద్ద బండ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో 3 లైన్స్ రోడ్డు ఉంటుందిజ డ్రైన్ పైన ఫుడ్ పాత్రలు, రోడ్డుకు మధ్యలో లైటింగ్, గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. 38 కోట్లతో డీఈఓ ఆఫీస్ నుండి కేశవరాజు పల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాం. 4.5 కోట్లతో పాత బస్తి రోడ్డు పనులు జరుగుతున్నాయి. అది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈద్గా వరకు రోడ్డు నిర్మాణ పనులు చివరి దశలో ఉంది. 4 కోట్ల రూపాయలతో హేలిపాడ్ నిర్మాణము జరుగుతుంది.
జంక్షన్ల గూర్చి వివరించండి?
4 కోట్లతో నల్లగొండ పట్టణం మొత్తంలో ఐదు జంక్షన్ లను ఏర్పాటు చేస్తున్నాం. గడియారం, మర్రిగూడ జంక్షన్లు పూర్తయ్యాయి. రామగిరి లోని సుభాష్ చంద్రబోస్, దేవరకొండ రోడ్ లోని డిఈఓ ఆఫీస్, సాగర్ రోడ్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జంక్షన్ల పనులు నడుస్తున్నాయి. 1.40 కోట్లతో పట్టణ శివార్లలో వెల్కమ్ ఆర్చీల బోర్డులు ఏర్పాటు చేశాం.
ఎన్ని పార్కులను ఏర్పాటు చేస్తున్నారు?
1.3 కోట్లతో రామ్ నగర్ పార్క్,1.5 కోట్లతో రాజీవ్ పార్క్ 1.41 కోట్లతో ఇండోర్ స్టేడియంలో పార్కు, 40 లక్షలతో స్విమ్మింగ్ పూల్, 15 లక్షలతో అన్నపూర్ణ క్యాంటీన్, 40 లక్షలతో క్యాంటీన్ పక్కనే పార్క్ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా 45 లక్షలతో పంచతంత్ర పార్క్, 3.2 కోట్లతో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల్లో అర్బన్ పార్క్ ప్రారంభం కానుంది.
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ?
2.5 కోట్లతో వల్లభ చెరువు వద్ద ఆధునీకరణ చేస్తున్నాము. సిసి రోడ్డు, రేలింగ్, ప్లానిటేషన్, తదితర పనులు చేపట్టాం. 80% పనులు పూర్తయ్యాయి. 4.5 కోట్లతో బీట్ మార్కెట్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు, అవి కూడా దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. 81 లక్షలతో దేవరకొండ రోడ్డులో రైతు బజార్, 3 కోట్ల రూపాయలతో హిందూపూర్ లో వైకుంఠధామం ఏర్పాటు జరుగుతుంది. 18 కోట్లతో యుజిడి పనులు జరుగుతున్నాయి. 1.10 కోట్లతో డంప్ యార్డ్ నిర్మాణ పనులు, 20 లక్షలతో బృహత్తర పట్టణ ప్రకృతి వనాలు 2, పది లక్షలతో పట్టణ ప్రకృతి వనాలు 11, 20 లక్షలతో 7 క్రీడా ప్రాంగణాలు, ఎనిమిది లక్షలతో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు జరుగుతుంది.
చేపట్టబోయే పనులు?
అమృత్ పథకం కింద యు జి డి (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) వాటర్ సప్లై, 11 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టనున్నాము. 56.75 కోట్లతో వాటర్ సప్లై 216.19 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 2.33 కోట్లతో ఉదయ సముద్రం, కళాభారతి, శిల్పారామం నిర్మాణ పనులు జరగనున్నాయి. డి పి ఆర్ లు సిద్ధం చేసి డిసెంబర్ నెలలో టెండర్లను పిలుస్తాం. 23 కోట్ల రూపాయలతో పట్టణ ప్రగతి నిధులతోటి వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టనున్నాము. ఈ పనులు పూర్తి కావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చు.
స్వచ్ఛ నల్గొండ వివరాలు?
100 శాతం స్వచ్ఛ నలగొండగా మార్చాలి అన్నది నా లక్ష్యం. ఇంటి నుండి నేరుగా చెత్త సేకరణ జరగాలి. ప్రజలకు విషయంపై ఇప్పటికే అవగాహన కల్పించాం. ప్రతి వార్డులో సిబ్బందితో ఉదయాన్నే పర్యటిస్తున్నాం.
రుణాల వివరాలు...?
కరోనా సమయంలో 4, వేల మంది వీధి వ్యాపారులకు రుణాలను అందించారు. నేను వచ్చాక మరో 4 వేల మందికి రుణాలు ఇచ్చాము. 16 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది.
చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు?
మంచినీటి సరఫరా రోజు తప్పి రోజు ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఏరియా లో ఉన్న ట్యాంక్ ద్వారా నిరంతరం నీటి సరఫరా చేయాలన్నది నా కల. అది చేస్తాను. వెయ్యి మందికి ఒక టాయిలెట్ నిర్మాణం ఉండాలి. అది మున్సిపల్ నిబంధనలో ఉంటుంది. అది వచ్చే జూన్ వరకు పూర్తి చేపిస్తా. ప్రస్తుతం 6 వేలకు పైగా అసెస్మెంట్ లు చేశాం. ప్రతి ఇంటికి నెంబర్ ఇస్తాం. ప్రజలు ఎవ్వరూ కార్యాలయానికి రాకుండా వారి ఫిర్యాదులను ఆన్లైన్లోనే స్వీకరించి పరిష్కరిస్తాం. ఇంటి వద్దకే సేవలను అందించి మునిసిపాలిటీపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలన్నదే నా లక్ష్యం.