Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ పాత నాయకులు
- రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు గడ్డు కాలమేనా?
నవతెలంగాణ-సూర్యాపేట
ఒకప్పుడూ కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన కొంతమంది నాయకులంతా ప్రస్తుతం కను మరుగయ్యారు. ప్రధానంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేనేపల్లి చందర్రావు, కోదాడలో పార్టీ ఫౌండర్ శశిధర్‌రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి యర్నేని బాబు, మున్సిపల్ మాజీ చైర్మెన్ అనిత లు పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాలలో కూడా మచ్చుకైనా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్యయాదవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మొత్తం కూడా తన కనుసన్నల్లోనే ఉండే వారితో టీమ్ రూపొందించుకొని పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోదాడలో ఉద్యమం నుండి పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఇతరపార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు.దీంతో అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శలు ఎమ్మెల్యేపై వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత కమిటీల నియమకాలలో మెజార్టీ పదవులు కాంగ్రెస్, టీడీపీ నుండి వచ్చిన వారికే ఇచ్చిన విషయం తెల్సిందే.ఈ పరిమాణంతో టీఆర్ఎస్ పాత నాయకులు అప్పటి నుంచి అంతర్గతంగా రగిలి పోతున్నారు. కాంగ్రెస్‌కు కంచు కోటలాగా ఉన్న కోదాడలో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన తమని ఎమ్మెల్యే విస్మరించడం పట్ల వారు మండి పడుతున్నారు.అదేవిధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకులు వేనేపల్లి చందర్రావు బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపు కోసం గత ఎన్నికల్లో పని చేశారు.ఆయన ఎమ్మెల్సీ లేదా ఏదైనా పదవి వరిస్తుందని నెలలుగా ఎదురు చూస్తున్నారు. కానీ అధిష్టానం నుండి ఎలాంటి హామీలు రాకపోవడంతో పాటు ఎమ్మెల్యే బొల్లం కూడా చందర్రావును పట్టించుకోవడం లేదన్న విమర్శలు నెలకొన్నాయి.ఇది గాక బొల్లం నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడంతో పాటు తన వర్గానికి చెందిన వారికి పదవుల్లో మొండిచెయ్యి చూపడంతో వేనేపల్లి కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కోదాడలో టీఆర్ఎస్ను బలోపేతం చేసిన శశిధర్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించగా అధిష్టానం టీడీపీ నుండి వచ్చిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.బొల్లం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శశిధర్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులను పూర్తిగా దూరం పెట్టినట్టు బహిరంగంగా చర్చ జరుగుతోంది.కోదాడలో పట్టు ఉన్న నాయకుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్నేనిబాబును ఆయన వర్గీయులకు కూడా బొల్లం చెక్ పెట్టారు. యర్నేని బహిరంగంగానే బొల్లంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.ఇకపోతే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనిత నాగరాజు బొల్లం గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేశారు.అనంతరం వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమెకు మొండి చెయ్యి చూపారు.ఇదే కాకుండా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వ లేదు.ఈ నేపథ్యంలో ఈ నలుగురు కూడా ఎమ్మెల్యే పై అసంతృప్తితో రగిలిపోతునట్టు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఉన్నత పదవులు నిర్వహించిన మైనార్టీకి చెందిన సీనియర్ నాయకులకు ప్రధాన పదవులు ఇవ్వ కుండా ప్రాధాన్యత లేని సమన్వయ కమిటీలో పద వులు ఇచ్చి మమ.. అనిపించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఈ రకంగా పార్టీలో ఉన్న అసం తృప్తి చాపకింద నీరులా ఎంత వరకు దారితీస్తుందో అనే ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో పార్టీకి అసంతృప్తివాదులతో గడ్డుకాలం ఏర్పడే పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.