Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఎదుర్కునేందుకు త్యాగాలకైనా కమ్యూనిస్టులు సిద్ధమే
- ప్రధాని ఉపన్యాసం బెదిరించేలా ఉంది
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-భువనగిరి
ప్రధాని మోడీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను బెదిరించటానికి చేసిన ఉపన్యాసంలా ఉందని, తెలంగాణ గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాట వారసుల గడ్డ అని, ఇలాంటి బెదిరింపు ఉపన్యాసాలకు తెలంగాణ ప్రజలు భయపడరని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గానీ, విభజన సమస్యల పరిష్కారం కోసం గానీ ఉపన్యాసంలో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.ప్రధాని ప్రసంగాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జైలు పాలైన వ్యక్తులను బీజేపీ సమర్థించడం సిగ్గు చేటన్నారు.బీజేపీ ఇతర రాష్ట్రాలలో చేస్తున్న కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కొనుగోలు ద్వారా పడగొట్టాలని బీజేపీ యత్నిస్తుందన్నారు.గవర్నర్లను తాబేదారులుగా వాడుతున్నారని, గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని గతంలోనే కమ్యూనిస్టులం చెప్పామన్నారు. దేశ ఆర్థికవ్యవస్థను నలుగురు వ్యక్తుల చేతిలో పెట్టి ప్రభుత్వరంగ సంస్థలను, దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సంక్షోభంలోకి నెట్టాలని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. ధరలు పెరగడం, నిరుద్యోగం పెరగడం, మతోన్మాదాన్ని మరింత పెంచడం కుట్రలో భాగమేనన్నారు. మూఢవిశ్వసాలను బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్నాయన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అలాంటి ప్రతిభనే చూపించి తెలంగాణ గడ్డమీద బీజేపీ ఆటలు సాగవని చూపించారన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ బీజేపీ మతోన్మాదాన్ని,మూఢవిశ్వాసాలను పెంచి పోషిస్తుందన్నారు. ఇలాంటి విధానాలను జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ జిల్లాలో బీజేపీ ఆటలు సాగకుండా సీపీఐ(ఎం) నాయకత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగిస్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి.పాషా, జెల్లల పెంటయ్య, బూర్గు కృష్ణారెడ్డి, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, దొడ యాదిరెడ్డి, గడ్డం వెంకటేష్, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్ పాల్గొన్నారు.